ఇంటర్ ఫస్టియర్ లో కృష్ణా ఫస్ట్

 

 

 

 

ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. జనరల్ విభాగంలో 54.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 74 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ చివరి స్థానం సాధించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో మంత్రి కె.పార్థసారథి ఆదివారం విడుదల చేశారు. ఫస్టియర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,91,337 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 4,86,658 మంది ఉత్తీర్ణులయ్యారు.

 

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 0.85% పెరిగింది. ఇక, ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికల హవా కొనసాగింది. బాలికల్లో 59.46%, బాలురలో 50.22% ఉత్తీర్ణులయ్యారు. కళాశాలల వారీగా మార్కుల రిజిస్టర్లను రెండు రోజుల్లో సంబంధిత ఆర్ఐవోలకు పంపుతారు. మార్కుల మెమోలను ఆయా ప్రిన్సిపాళ్లు ఈనెల 26న తీసుకుని, సాధ్యమైనంత త్వరలో విద్యార్థులకు ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ కోరారు.



మార్కుల మెమోల్లో తేడాలుంటే మే 22లోగా ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలి. ఫస్టియర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి హాజరయ్యే విద్యార్థులు మే 3వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు పేపర్‌కు రూ.100 చొప్పున, జవాబు పత్రాల జిరాక్స్ కాపీలకు పేపర్‌కు రూ.600 ఫీజుగా చెల్లించి, మే 4లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Teluguone gnews banner