వైసీపీ రాజకీయాలకు అమాయకురాలు బలి
posted on Mar 14, 2024 9:16AM
ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే వైసీపీకి హత్యారాజకీయాలకు తెరలేపడం .. వాటిని ప్రతిపక్ష పార్టీలపైకి నెట్టడం అలవాటుగా మారింది. 2019 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి, వై సీపీ నేత వివేకానంద రెడ్డి హత్య జరిగింది.. ఆ హత్య చంద్రబాబు నాయుడి కుట్రేనంటూ ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేసి ఆ ఎన్నికలలో లబ్ధి పొందింది. చంద్రబాబు వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి గొడ్డలితో హత్యచేశారు అన్నట్లుగా నారాసుడి రక్తచరిత్ర అంటూ కథనాలు వండి వార్చింది. అప్పట్లో ఆ ప్రచారం వైసీపీకి కలిసి వచ్చి అధికారం దక్కింది. సొంత బాబాయ్ హత్యతో ప్రజలలో జగన్ పై సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడింది. జగన్ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి కానీ తెలియలేదు.. వివేకానంద రెడ్డిని హత్య వెనుక ఉన్నది జగన్ కుటుంబీకులేనని. స్వయంగా వివేకా కూతురు సునీతారెడ్డే మా నాన్నను హత్య చేసింది అవినాశ్ రెడ్డి అనీ, అందుకు జగన్ మోహన్ రెడ్డి సహకారం ఉందని సునీత అనుమానం వ్యక్తం చేశారు. అవినాష్ అరెస్టును జగన్ అడ్డుకోవడానికి కూడా కారణం అదేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. దీంతో జగన్ బండారం బయటపడి ప్రజలంతా చీదరించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్దిచెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రజల దృష్టిని మరల్చి మళ్లీ సానుభూతిని పొందాలని జగన్ అండ్ కో కొత్తనాటకానికి తెరలేపింది. గీతాంజలి అనే వివాహిత మృతిని రాజకీయంగా వాడుకొనేందుకు వైసీపీ అధిష్టానం నానాపాట్లు పడుతోంది.
ఏపీలో గత మూడు రోజులుగా గీతాంజలి మరణంపైనే చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధిపొందేందుకు వైసీపీ అధిష్టానం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నది. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు చేసిన ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని వైసీపీ బురద జల్లుతోంది. వైసీపీ విసిరిన బురదను కడుక్కోలేక తెలుగుదేశం, జనసేన పార్టీలు నానా తంటాలు పడుతున్న పరిస్థితి. ఆ స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా ప్రజల్లోకి తప్పుడు ప్రచారం చేస్తున్నది. అసలు గీతాంజలి ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా? ప్రమాదవ శాత్తూ ఆమె రైలు ప్రమాదంలో మరణించిందా అనే విషయాలు పూర్తిగా బయటకు రాకముందే.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆ నెపాన్ని తెలుగుదేశం, జనసేనపై నెట్టేందుకు చేయకూడని ప్రయత్నాలు చేస్తోంది. మరీ దుర్మార్గమైన చర్య ఏమిటంటే.. గీతాంజలి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆమె ఇంటికి వద్దకు వెళ్లిన వైసీపీ అనుకూల మీడియా చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఆమె భర్తతోపాటు, ఆమె ఇద్దరు చిన్న పిల్లల వద్దసైతం మైకుపెట్టి జనసేన, తెలుగుదేశం ట్రోలింగ్ వల్లే మా అమ్మ చనిపోయిందని చెప్పించే ప్రయత్నానికిసైతం దిగజారి ప్రయత్నించింది. అంటే.. ఈ ఘటనను తెలుగుదేశం, జనసేన పార్టీలపై నెట్టేందుకు వైసీపీ అధిష్టానం ఎంత వ్యూహాత్మంగా ముందుకెళ్తుందో అర్థంచేసుకోవచ్చు.
గీతాంజలి ఈ నెల 7వ తేదీన రైలు ప్రమాదానికి గురైంది.. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 11వ తేదీన మృతిచెందారు. ఆమె ప్రమాదానికి గురైననాటి నుంచి పట్టించుకోని వైసీపీ నేతలు.. ఆమె చనిపోయిందని తెలియగానే తమ పనిని ప్రారంభించారు. జనసేన, తెలుగుదేశం ట్రోలింగ్ వల్లే ఆమె మరణించిందని సోషల్ మీడియాలో, తమ అనుకూల మీడియా చానల్స్ లో మారుమోగించారు. ఇంతలోనే జగన్మోహన్ రెడ్డి గీతాంజలి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎన్నికల సమయంలో శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మార్చుకున్న వైసీపీ కుట్రలను గమనించిన తెలుగుదేశం అలర్ట్ అయింది. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేసింది. ఆమె ప్రమాదానికి గురైన సమయంలో వీడియోను టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో గీతాంజలికి ప్రమాదం జరిగిన సమయంలో గుమ్మిగూడిన ప్రజలు ఆమెను రైల్లో నుంచి ఎవరో ఇద్దరు నెట్టేశారని మాట్లాడుకున్నారు. ఆమెను నెట్టింది ఎవరు? అనే విషయాన్ని పక్కనపెట్టిన ప్రభుత్వం.. తెలుగుదేశం, జనసేన ట్రోలింగ్ వల్ల మనస్తాపానికి గురై గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది.
గీతాంజలి మృతి ఘటనలో ముందుగా పోలీసులు ఎవరినైనా విచారించాలంటే వైసీపీ సోషల్ మీడియా విభాగాన్నే. ఎందుకంటే.. ప్రజలకు అరకొరగా అందిన జగన్ మోహన్ రెడ్డి పథకాలను ప్రజల్లో పాపులర్ చేసే ప్రయత్నంలో ఎవరికి పడితే వారికి ట్రైనింగ్ ఇచ్చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా వీడియోలను వదులుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం. ఈ సమయంలో తెలుగుదేశం, జనసేన ఒకపక్క.. వైసీపీ మరోపక్క సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకోవటం కామన్.. ఇది ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్నది. అంతెందుకు.. జగన్ పై విమర్శలు చేస్తున్న ఆమె సోదరిలు వైఎస్ షర్మిల, సునీతారెడ్డిలపై వైసీపీ సోషల్ మీడియా ఎంతలా విషం కక్కిందో ప్రజలందరికీ తెలిసిందే. షర్మిల కన్నీరు సైతం పెట్టుకున్నారు. సునీత కేసుకూడా పెట్టారు. ఇలాంటి తరుణంలో అభంశుభం తెలియని వారితో జగన్ కు పబ్లిసిటీ వచ్చేలా మాట్లాడించి.. వారి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వారిని ఇబ్బందులు పాలుచేసి లబ్ధిపొందాలని వైసీపీ భావిస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది.
గీతాంజలికి ఇద్దరు పిల్లలు. వారి వయస్సు మూడునాలుగేళ్లు ఉంటుంది. అయితే.. మాకు అమ్మ ఒడి ఐదేళ్లుగా వస్తుందని గీతాంజలితో వైసీపీ సోషల్ మీడియా విభాగం చెప్పించింది. ఒక పక్క పిల్లలు చూస్తే మూడునాలుగేళ్ల వయస్సు. మరి గీతాంజలికి ఐదేళ్లుగా అమ్మ ఒడి ఎలా అందుతున్నదని తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు ప్రశ్నించి ఉండొచ్చు. తెలుగుదేశం విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఎవరో ఇద్దరు వ్యక్తులు గీతాంజలిని రైలు నుంచి నెట్టేశారని అర్థమవుతోంది. ఆ విషయంపై విచారణచేసి.. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆమె చివరిగా మాట్లాడింది ఎవరితో , ఆమెకు తెల్లవారుజామున ఫోన్లు వచ్చాయని భర్త చెపుతున్నాడు.. ఆ సమయంలో ఫోన్ చేసింది ఎవరు అనే విషయాలపై నెగ్గుతేల్చితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ అది తేల్చకుండా వైసీపీ ప్రభుత్వం గీతాంజలి మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుండటం కన్నా సుగ్గుమాలిన చర్య మరొకటి ఉండదని పరిశీలకులు పేర్కొంటున్నారు.