భారత రక్షణ రంగం మరింత శక్తిమంతం!
posted on Oct 24, 2025 @ 11:07AM
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల ఆధునికీకరణ కోసం 79 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం (అక్టోబర్ 23) జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. రెండు నెలల కిందటే రక్షణ రంగాన్ని శక్తిమంతం చేసేందుకు 67 వేల కోట్ల రూపాయల విలువైన విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. తాజాగా అదే లక్ష్యంతో మరో భారీ కొనుగోలుకు పచ్చజెండా ఊపింది.
డీఏసీ సమావేశంలో ఆమోదించిన కొనుగోళ్లలో భారత నౌకాదళం కోసం అత్యాధునిక ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్ (ఎల్‌పీడీ), నావల్ సర్ఫేస్ గన్స్, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలు, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రా-రెడ్ సెర్చ్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. ఎల్‌పీడీల ద్వారా ఆర్మీ, వైమానిక దళాలతో కలిసి నౌకాదళం ఉభయచర కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టార్పెడోలు సంప్రదాయ, అణు జలాంతర్గాములను సైతం లక్ష్యంగా చేసుకోగలవు.
అలాగే సైన్యం కోసం 2వేల 408 ట్యాంక్ విధ్వంసక 'నాగ్ మార్క్-2' గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద డీఏసీ ఆమోదం తెలిపింది. శత్రువుల యుద్ధ వాహనాలు, బంకర్లను సులభంగా ధ్వంసం చేయడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీంతో పాటు భూతలం నుంచి శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు మొబైల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా, వైమానిక దళం కోసం లాంగ్ రేంజ్ టార్గెటింగ్ సిస్టమ్‌ల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.
ఇక పదాతిదళ 380 పదాతిదళ బెటాలియన్లను 'ఆష్ని' డ్రోన్ ప్లాటూన్లతో అనుసంధానం చేసేందుకు ఆమెదం తెలిపింది. సరిహద్దుల్లో సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచే ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు డీఏసీపేర్కొంది. ప్రతి బెటాలియన్‌కు కేటాయించే ప్లాటూన్‌లో కనీసం నాలుగు నిఘా డ్రోన్లు ఉంటాయని తెలిపింది. దీనితో పాటు 2 వేల770 కోట్ల రూపాయలతో 4.25 లక్షల తుపాకుల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.