ప్రయాణికులకు షాక్..రైల్వే టికెట్ ఛార్జీల పెంపు
posted on Jun 24, 2025 @ 4:28PM
ప్రయాణికులపై ఇండియన్ రైల్వే ఛార్జీల భారం మోపడానికి సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా స్థిరంగా ట్రైన్ టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు జూలై1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి కానుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీ కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెరగనుంది.
ఏసీ తరగతుల్లో ప్రయాణానికి కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. అయితే, సబర్బన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో కూడా ఎటువంటి పెంపు ఉండదు. 500 కిలోమీటర్లకు మించిన దూరాలకు మాత్రం సెకండ్ క్లాస్ ప్రయాణంలో కిలోమీటర్‌కు అర పైసా చొప్పున ఛార్జీ పెరగనుంది.