టాప్ డిఫాల్టర్ల 68,600 కోట్ల రూపాయల రుణాలు రద్దు!
posted on Apr 29, 2020 9:20AM
బ్యాంకులకు వేల కోట్లు రూపాయలు కుచ్చు టోపీ పెట్టి, ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసిన 68,000 కోట్ల రుణాలను రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్న ద్వారా ఈ సమాచారం వెల్లడైంది.
సాకేత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తనకు 50 మంది టాప్ విల్‌ఫుల్ డిఫాల్టర్లు, వారి కరెంట్ లోన్ స్టేటస్ కావాలని ఫిబ్రవరి 16న దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 24న ఆర్‌బిఐ సమాధానం ఇచ్చిందని సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. ఆర్బీఐ 30 సెప్టెంబర్ 2019 నాటికి విల్ ఫుల్ డిఫాల్టర్లు, రుణాల రద్దు వివరాలను అందించింది.
విల్ ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో మొదటి స్థానంలో విదేశాలకు పారిపోయిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ ఓనర్ మెహుల్ చోక్సీ ఉన్నారు. చోక్సీ కంపెనీలకు చెందిన రూ.5,492 కోట్ల రుణాలను ఆర్బీఐ రద్దు చేసింది.
రెండు మూడో స్థానాల్లో FMCG కంపెనీ REI ఆగ్రో లిమిటెడ్, జతిన్ మెహతా విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ లిమిటెడ్ ఉన్నాయి.
REI ఆగ్రోకు చెందిన రూ.4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్‌కు చెందిన రూ.4,076 కోట్లు.
రోటోమా గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన రూ.2,850 కోట్లు.
ఖుదోస్ కెమి లిమిటెడ్‌కు చెందిన రూ.2,326 కోట్లు.
బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలకు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రూ.2,212 కోట్ల రుణాలు రద్దు చేశారు.
జూమ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.2,012 కోట్ల రుణాలు రద్దయ్యాయి.
లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా కంపెనీలకు సంబంధించి రూ.1,943 కోట్ల రుణాలు రద్దు చేశారు.
ఫరెవర్ ప్రీసియస్ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్ ప్రయివేటు లిమిటెడ్ రూ.1,962 కోట్లు.
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్లు.
చోక్సీకి చెందిన ఇతర కంపెనీలు గిలి ఇంండియా లిమిటెడ్ రూ.1,447 కోట్లు.
నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్ రూ.1,109 కోట్లు రద్దు చేశారు.
50 మంది వివిధ బ్యాంకులకు ఎగవేసిన రుణాల విలువ రూ.68,607 కోట్లు అని ఆర్బీఐ తెలిపింది. జయంతిలాల్ ఎన్ మిస్త్రీ కేసులో 2015 డిసెంబర్ 16 సుప్రీంకోర్టు తీర్పులోని 77 వ పేరా ప్రకారం ఆర్టీఐ చట్టం 2005 లోని సెక్షన్ 8 (1) (ఎ) ప్రకారం, విదేశీ రుణగ్రహీతల సమాచారం బహిరంగ బహిర్గతం నుండి మినహాయించబడిందని ఆర్బిఐ తెలిపింది.