టెస్టు చరిత్రలో టీమిండియా అత్యంత చెత్త రికార్డు!
posted on Dec 19, 2020 @ 11:46AM
పింక్ బాల్ టెస్ట్‌లో టీమ్ ఇండియా చెత్త రికార్డు సృష్టించింది. బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే ఆలౌటైంది. టెస్టుల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యల్ప స్కోర్ . 1974లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 42 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాని తర్వాత ఇదే అత్యల్ప స్కోర్. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్సులో ఒక్క బ్యాట్స్‌మాన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్. ముగ్గురు భారట బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు.
ఓవర్ నైట్ స్కోర్ 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ పోటాపోటీగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 15 పరుగుల వద్ద వరుసగా నాలుగు వికెట్లు పడ్డాయి. నైట్ వాచ్‌మాన్ జస్ప్రిత్ బుమ్రా (2) కమ్మిన్స్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే చతేశ్వర్ పుజార (0) కూడా కమ్మిన్స్ బౌలింగ్‌లోని కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జోష్ హాజెల్‌వుడ్ ఒకే ఓవర్లో మయాంక్ అగర్వాల్ (9), అజింక్య రహానే (0)ను అవుట్ చేశాడు. మరో నాలుగు పరుగులు జోడించిన తర్వాత విరాట్ కోహ్లీ (4) కమ్మిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హనుమ విహారి (8), వృద్దిమాన్ సాహ (4), రవిచంద్రన్ అశ్విన్ (0) కూడా వెంటవెంటనే అవుటయ్యారు. పాట్ కమ్మిన్స్ వేసిన ఒక బంతి మహ్మద్ షమి చేతికి తగిలి గాయపడటంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో టీమ్ ఇండియా 36/9 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది.
ఆసిస్ బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ టెస్టులోనే అతను 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 191 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్ లో కోహ్లీ సేన ఘోరంగా విఫలం కావడంతో ఆస్ట్రేలియా 90 పరుగులు చేస్తే ఈ టెస్ట్ మ్యాచ్ ను గెలుచుకుంటుంది.