ఈరోజు భారత్ ఆస్ట్రేలియా తాడో పేడో..!
posted on Mar 27, 2016 @ 4:19PM
వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో తలపడే మూడు టీంలు ఏవేవో తేలిపోయాయి. ఇక మిగిలింది గ్రూప్ 2 నుంచి వచ్చే సెమీస్ కు వచ్చే రెండో టీం ఏదా అన్న ప్రశ్నే. గ్రూప్ 2 లో న్యూజిలాండ్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోగా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇంటిబాట పట్టేశాయి. మిగిలింది భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే. అందుకే ఈరోజు ఈ రెండు టీం ల మధ్యా జరగబోయే మ్యాచ్ ను క్వార్టర్ ఫైనల్ గా చెబుతున్నారు విశ్లేషకులు. రెండు టీం లకూ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. గెలిస్తే నిలుస్తారు. బంగ్లాదేశ్ పై అతికష్టమ్మీద గెలిచినా, ఆఖరి ఓవర్లలో పది పరుగుల్ని కాపాడుకున్న టీం ఇండియా కాన్ఫిడెన్స్ ఆకాశంలో ఉంటుందనడంలో డౌట్ లేదు.
పైపెచ్చు ఆస్ట్రేలియాలో టి20 సీరీస్ లో ఆ జట్టును ఓడించి వచ్చిన ధోనీ సేనకే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫామ్ లో ఉన్న వాట్సన్ ను, భారత్ అంటే రెచ్చిపోయే స్మిత్ ను, బౌలింగ్ లో ఫాల్క్ నర్ ను భారత్ సమర్ధంగా ఎదుర్కోగలిగితే విజయం టీం ఇండియాదే. ఎప్పటిలాగే, టీం ఇండియాకు విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. బౌలింగ్ లో నెహ్రా, బుమ్రా స్థాయికి తగ్గట్టు రాణిస్తే, సెమీస్ టీం ఇండియా చేతిలోకి వచ్చేసినట్టే. మ్యాచ్ జరిగే మోహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమైనా, మెన్ ఇన్ బ్లూ కంటే ముందు ఇదే పిచ్ పై ఉమెన్ ఇన్ బ్లూ వెస్టిండీస్ తో తలపడుతుండటంతో, పిచ్ బాగా నెమ్మదించే అవకాశం ఉంది.