తండ్రితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి
posted on Mar 4, 2016 @ 3:06PM
స్నాప్‌డీల్ సంస్థలో పనిచేసే దీప్తి అనే యువతి, గత నెల ఒక కిడ్నాప్ ప్రమాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే! చివరకు దీప్తిని పీకల్లోతు ప్రేమించిన వ్యక్తే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని తెలియడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటనను మరువక ముందే, నోయ్‌డాకు చెందిన శిప్రా మలిక్ అనే 29 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ కిడ్నాప్ అయిన వార్త సంచలనం సృష్టిస్తోంది . ఈ సోమవారం నుంచి కనిపించకుండా పోయిన శిప్రా నిన్న గుర్‌గావ్ వద్ద క్షేమంగా దొరికింది. ఒక ముగ్గురు వ్యక్తులు తనను నోయ్‌డాలో కిడ్నాప్ చేశారనీ, నాలుగు రోజుల తరువాత వారు గుర్‌గావ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాననీ ఆమె చెబుతోంది. కానీ పోలీసులు శిప్రాను విచారించిన ప్రతిసారీ ఒకోరకంగా మాట్లాడుతూ ఉండటంతో, శిప్రా చెబుతున్న విషయాలు ఎంతవరకు నిజమో అని పోలీసులకు అనుమానం కలిగింది.
దీంతో శిప్రాని కిడ్నాప్ చేశారని చెప్పిన సమయం దగ్గరనుంచి ఆమె కదలికలను విచారించిన పోలీసులకు, శిప్రా చెబుతున్నదంతా అబద్ధం అని తేలిపోయింది. శిప్రాను మరోసారి కటువుగా విచారించడంతో తను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాననీ, వాటి నుంచి బయటపడేందుకు ఈ కిడ్నాప్ నాటకం ఆడేందుకు ప్రయత్నించాననీ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు రోజులూ రాజస్థాన్‌లోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నట్లుగా కూడా శిప్రా చెప్పుకొచ్చిందట. శిప్రా ఆడిన ఈ కిడ్నాప్ నాటకంలో ఆమె సోదరుడు, తండ్రి కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిప్రా కనిపించకుండా పోవడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో, ఆమె తన నాటకాన్ని చాలించి తిరిగి వచ్చేసి ఉంటుందని భావిస్తున్నారు.