భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నం కూడా తప్పేనా?
posted on Dec 8, 2015 @ 10:29AM
భారత్-పాక్ మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. భారత్ లో ప్రభుత్వాలు మారినప్పటికీ పాకిస్తాన్ తో తన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. నరేంద్ర మోడీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య డిల్లీలో జరుగవలసిన సమావేశం పాక్ మొండి వైఖరి వలన రద్దయిన తరువాత పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చేయి. కానీ ప్రధాని నరేంద్ర మోడి నిరాశ చెందకుండా మళ్ళీ ఇటీవల పారిస్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి మాట్లాడి, మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యేందుకు మార్గం సుగమం చేసారు.
డిల్లీలో జరుగవలసిన ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం బ్యాంకాక్ విమానాశ్రయంలో ఉన్న ఒక స్టార్ హోటల్లో జరిగింది. మోడీ చొరవ కారణంగా జరుగుతున్న ఆ సమావేశాన్ని స్వాగతించవలసిన ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకు పడటం చాలా విస్మయం కలిగిస్తోంది. ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలియకుండా అంత రహస్యంగా సమావేశం ఎందుకు నిర్వహించవలసి వచ్చిందని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు పాక్ సైనికులు, పాక్ ఉగ్రవాదులు సరిహద్దులలో భారత్ సైనికులపై, గ్రామ ప్రజలపై కాల్పులకు తెగబడుతుంటే, మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ తో అంత హడావుడిగా, రహస్యంగా చర్చలు ఎందుకు జరుపవలసి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. అయితే వారడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వారికి కూడా బాగా తెలుసు.
పాకిస్తాన్ వలన భారత్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటునప్పటికీ, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా దానితో స్నేహసంబంధాలు మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలోనే మళ్ళీ చర్చలకు మార్గం సుగమం చేసారు. నిజానికి డిల్లీ లేదా ఇస్లామాబాద్ లలో తప్ప వేరే చోట సమావేశం అవడానికి పాక్ చాలా కాలంగా నిరాకరిస్తోంది. కానీ హురియత్ నేతల కారణంగా డిల్లీలో, జమైతే-ఉద్-దవా వంటి ఉగ్రవాద సంస్థల కారణంగా ఇస్లామాబాద్ లో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగేవాతావరణం లేకపోవడంతో బ్యాంకాక్ లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని మోడీ ఒప్పించగలిగారు. అందుకు మోడీని అభినందించాలి. కానీ మన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది వరకు హురియత్ నేతలతో మాట్లాడితే తప్ప డిల్లీలో ఇటువంటి సమావేశానికి హాజరుకామని తెగేసి చెప్పిన పాక్ ఇప్పుడు ఆ షరతు విధించకుండా సమావేశానికి అంగీకరించడం మోడీ సాధించిన విజయమే కదా? అందుకు ఆయనను మెచ్చుకోకపోగా పాకిస్తాన్ తో ఆయన ఏదో రహస్య ఒప్పందం చేసేసుకొన్నట్లు ప్రతిపక్షాలు రభస చేయడం హాస్యాస్పదంగా ఉంది.
ఆ సమావేశంలో ఇంతవరకు ఇరు దేశాలు చర్చిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దులలో కాల్పులు వంటి అంశాలపై చర్చించారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ సమావేశం గురించి తమకు ముందుగా తెలియజేయనందుకే ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి తప్ప వేరే బలమయిన కారణాలేవీ కనిపించడం లేదు. ఈ సమావేశం జరుగుతున్నట్లు ఒకవేళ ముందుగా ప్రకటించినట్లయితే పాక్ ఉగ్రవాదులో లేదా హురియత్ నేతలో దానికి తప్పకుండా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేసి ఉండేవారు. ఇక్కడ భారత్ లో ప్రతిపక్షాలు ఏవిధంగా మోడీని విమర్శిస్తున్నాయో అదే విధంగా మోడీతో మాట్లాడినందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను అక్కడి ఉగ్రవాదులతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. కానీ ఇద్దరు ప్రధానులు ఒక మంచి ప్రయత్నం చేస్తునప్పుడు కూడా ఈవిధంగా వారిపై విమర్శలు గుప్పించడం సబబు కాదు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేసినా దానిని వ్యతిరేకించడమే రాజకీయమనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు.