టీడీపీ కూటమిలో పెత్తనమంతా మోదీదే
posted on Mar 10, 2024 @ 6:45PM
బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తులు ఖరారైన నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచార సభలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా నరేంద్ర మోడీని ఏపీకి తీసుకురావడం ద్వారా.. ప్రజలను పొత్తుల పార్టీవైపు నడిపించేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు వేసుకున్నారు. ఈ క్రమంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీనే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
వైసీపీని ఓడించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కూటమిగా ఏర్పడడమే కాదు గెలిపించే బాధ్యత కూడా మోడీ పైనే పెట్టింది టీడీపీ కూటమి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్తుండడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాల్సి ఉంది. ఆ బాధ్యతను ప్రధాని మోదీకే అప్పగించారు. రాష్ట్రానికి సంబంధించి ఒకటి రెండు కీలక ప్రకటనల్ని మోదీతో చేయించడం ద్వారా కూటమిపై విశ్వాసం కలుగుతుందనేది ఆ పార్టీల ప్లాన్. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బహిరంగసభకు ప్లాన్ వేశాయి. అయితే ఇప్పుడు మోదీ కూడా వస్తుండడంతో సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తారా.. లేకుంటే మరో ప్రాంతాన్ని ఎంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ఆ సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ వెల్లడిస్తారని సమాచారం.
బీజేపీ పొత్తుకు ఓకే చెప్పింది. దీంతో టీడీపీ, జనసేన ఫుల్ హ్యాపీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ అంత గొప్పగా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారు. కానీ జగన్ దాన్ని కాదని మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అయినా మోదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. మరోవైపు విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ఇంతవరకూ వాటాలు తేల్చలేదు. పోలవరం పూర్తి కాలేదు. రైల్వే జోన్ సాకారం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మెడపైన వేలాడుతోంది. ఇలా అనేక అంశాలపై బీజేపీ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. 145 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు.
ప్రధాని ఏపీకి వస్తే.. ఎలాంటి హామీలు ఇస్తారు? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా.. మరో కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని కూటమి చెబుతోంది.
ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏమేం మాట్లాడుతారో అనేదానిపై కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సర్వత్రా చర్చ సాగుతోంది.