స్మృతి ఇరానీకి యేల్ యూనివర్సిటీ డిగ్రీ...
posted on Aug 11, 2014 @ 3:07PM
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల గురించి కాంగ్రెస్ పార్టీ నానా గందరగోళం చేసి ఆ తర్వాత సౌండ్ చేయకుండా వున్న విషయం తెలిసిందే. పెద్దగా విద్యార్హతలు లేని స్మృతి ఇరానీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేశారని కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంది. అయితే స్మృతీ ఇరాని సమర్థత చూసి ఆ తర్వాత చప్పుడు చేయకుండా వుంది. అయితే తాజాగా స్మృతీ ఇరానీ తాను అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందానని చెప్పడంతో ఈ అంశాన్ని మళ్ళీ ఎలా రాజకీయం చేయాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇదిలా వుంటే, యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీపై మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. భారతదేశానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులతో పాటు ఓ ఎంపీగా స్మృతి ఇరానీ యేల్ విశ్వవిద్యాలయంలో జరిగే నాయకత్వ సదస్సుకు వెళ్తున్నట్లు తెలిపింది. ఆమె ఆ సదస్సులో పాల్గొనడానికి ఆమె డిగ్రీ సర్టిఫికెట్ పొందే విషయానికి సంబంధం లేదని కూడా చెప్పింది.