తెలంగాణలో రెట్టింపైనా హైదరాబాద్ ఓటమి... అంతర్మథనంలో బిజెపి అధిష్టానం
posted on Jun 11, 2024 @ 1:06PM
తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్న బిజెపి రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను గెలిచినప్పటికీ హైదరాబాద్ పరాజయానికి గల కారణాలను అన్వేషించ పనిలో అధిష్టానం ఉంది. దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసిన హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో అట్టర్ ప్లాప్ గా ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అనే విషయంలో ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. మాధవిలత గెలిచి తీరుతుందని రెండు ఎగ్జిట్ పోల్ సర్వేలు తప్పితే మిగతా అని సర్వేల్లో ఓడిపోతుందని తేల్చేశాయి. ఈ సర్వేల ఫలితాలే నిజమయ్యాయి. బిజెపి పెద్దలు ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని హైప్ క్రియేట్ చేసిన మాధవిలత ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేత కాల్వ సుజాత ముందు నుంచే చెబుతున్నారు.మాధవిలత సనాతన సంప్రదాయాన్ని ప్రమోట్ చేసుకుని బిజెపి టికెట్ కొట్టేసిందని ఆమె విమర్శించారు. హైదరాబాద్ ఓటర్లు చాలా తెలివైన వారని ఆమె అన్నారు. మాధవిలత మజ్లిస్ పార్టీకి గట్టి ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు. మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి వచ్చిన ఓట్లలో సగం మాత్రమే మాధవిలతకు పోలయ్యాయి. మూడు లక్షలకు పైగా వోట్లతో అసదుద్దీన్ గెలుపొందడం వల్ల బిజెపి శ్రేణులు నిరాశ చెందాయి. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ ప్రచారంలో మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపెయినర్ గా ఉండే రాజాసింగ్ హైదరాబాద్ లోకసభ నియోజకవర్గ ప్రచారంలో మాత్రం పాల్గొనకపోవడాన్ని అధిష్టానం లెక్కల్లో తీసుకుంది. అంతే కాదు బిజెపిలో హిందుత్వ వాదులు ఎక్కువగానే ఉన్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని 40 ఏళ్లుగా విస్మరించిన మజ్లిస్ తో విభేధించే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. వాళ్లు కూడా హైదరాబాద్ లోకసభ టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరిలో బిజెపి మహిళా మోర్చా అధికారప్రతినిధి నడింపల్లి యమునా పాఠక్ ఒకరు. విద్యాధికురాలైన ఈమెకు బిజెపిలో మంచి ఇమేజి ఉంది. బిజెపి పెద్దలకు చిరపరిచితురాలైన యమునాపాఠక్ ఈ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మాధవిలత దెబ్బకు అధిష్టానం ఆమెకు మొండి చేయి చూపింది. సామాజిక కార్యక్రల్లో చురుకుగా ఉండే యమునాపాఠక్ ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని ఆమె బలంగా నమ్ముతారు. హైదరాబాద్ టికెట్ యమునా పాఠక్ కి అని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరి క్షణాల్లో ఈ టికెట్ మాధవిలత ఎగరేసుకుపోయింది. యమునా పాఠక్ పూర్వికులు దేశ స్వాతంత్యోద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ నడింపల్లి వంశీయులకు పెద్ద పీట వేశారు. యమునాపాఠక్ సేవలను గుర్తించి బిజెపి అధిష్టానం విదేశాలలో జరిగే అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఇండియా తరపున ఆమె పేరును సిఫారసు చేసిన సందర్బాలు అనేకం. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న బిజెపి శ్రేణులను మాధవిలత కలుపుకుని పోకపోవడం వల్లే బిజెపి పరాజయం చెందింది. ఇప్పటి వరకు ఇంత భారీ మెజారిటీలో బిజెపి ఓడిపోవడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో కోలుకోలేని దెబ్బకు మాధవిలత ప్రధాన కారణమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వారికి టికెట్లు ఇవ్వకుండా బిజెపి అధిష్టానం జాగ్రత్త పడాలని నెటిజన్లు అంటున్నారు. మాధవిలత ఓవర్ యాక్షన్ వల్లే బిజెపి ఓటమి చవి చూసిందన్న వాదన తెరమీదకు వస్తుంది. ముస్లిం మహిళల హిజాబ్ తీసేయాలని పోలింగ్ బూత్ లో ఆమె చేసిన విన్యాసం బెడిసి కొట్టింది. ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుని మాధవిలత మీద కేసు నమోదు చేయాలని పురమాయించడం గమనార్హం.