జగన్ బర్త్ డే.. సంబరాల పేరిట పశుబలులు!
ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో.. అలా ఉంటారు జగన్. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు జగన్. ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ, ఆయన నేతృత్వంలోని వైసీపీకి లేవు అంటారు పరిశీలకులు. ఔను మరి యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నాయకుడిని బట్టే ఆయన పార్టీ, ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ అలా కాకుండా మరెలా ఉంటాయం టున్నారు రాజకీయ పండితులు.
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఆనవాలు అన్నదే రాష్ట్రంలో కనిపించలేదు. కక్షసాధింపు, వ్యతిరేకించిన వారిపై కేసులు, అరెస్టులే పాలనగా ఆయన అధికారంల ఉన్న ఐదేళ్లూ కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
అది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తీరు, ఆయన పార్టీ తీరు ఇసుమంతైనా మారలేదు. తాజాగా ఆదివారం జగన్ 53వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీయులు నానా హంగామా సృష్టించారు. జనం ఈసడించుకునేలా పశుబలులు ఇచ్చి రక్తం చిందించారు. ఇక జగన్ కు జనాభిమానం తగ్గలేదని చాటేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలూ వేయించారు. జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి ఫ్లయిట్ ఎక్కగానే ఆయన పేరున్న గౌన్లు వేసుకున్న చిన్నారులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశారు. అసలు ఆ విమాన ప్రయాణీకులలో జగన్ ఉంటారని వైసీపీయులకు వినా మరొకరికి తెలిసే చాన్సే లేదుగా. అందుకే చిన్నారులతో చేసిన ఆర్భాటమంతా పెయిడ్ ఆర్టిస్టుల పనేనని ఇటే తెలిసిపోతోందంటున్నారు పరిశీలకులు.
సరే ఫ్లైట్ సీన్లు అలా ఉంటే.. ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జగన్ పై అభిమానమంటూ వైసీపీ యులు చేసిన విన్యాసాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రప్ప రప్ప గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు హోర్డింగులే కాకుండా మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో , మండల కేంద్రమైన విడపనకల్లు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేశారు. ఇక ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు 2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారంలో లేకుండానే ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీయులు.. పొరపాటున వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఆ హింసాకాండను, అరాచకత్వాన్నీ తట్టుకోగలమా అన్న భయాందోళనలు ఇప్పటి నుంచే జనంలో వ్యక్తమౌతున్నాయి.