బైపోల్ బెదుర్స్.. ఆలస్యం ఎవరికి అమృతం? ఎవరికి విషం?
posted on Jun 8, 2021 @ 5:01PM
రేపేమాపో ఈటల రాజీనామా. రాజేందర్ రాజీనామాతో త్వరలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక. ఇదీ కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట. అయితే, ఆ 'త్వరలో' అంటే ఎన్నిరోజులో చెప్పడం మాత్రం కష్టం అంటున్నారు. కలిసొస్తే కనీసం ఆరు నెలలు. లేదంటే అంతకుమించే సమయం పడుతుందని అంటున్నారు. ఆలోగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఈటల రాజీనామా వేడి చల్లారిపోవచ్చు. రాష్ట్రంలో మరో పొలిటికల్ హడావుడి పెరగొచ్చు. ఈటల తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా వేటు పడుతుందని అంటున్నారు. అదే నిజమైతే.. ఫోకస్ హుజురాబాద్ నుంచి సూర్యాపేట వైపు షిఫ్ట్ అవ్వొచ్చు. కాలం గడుస్తున్నా కొద్దీ రాజకీయం ఎలాగైనా మారొచ్చు. అందుకే, ఇప్పుడు ఈటల రాజీనామా, ఆమోదం, ఉప ఎన్నికపై ఉత్కంట పెరుగుతోంది.
ఎమ్మెల్యే ఎవరైనా రాజీనామా చేస్తే.. స్పీకర్ ఆమోదం తప్పనిసరి. అయితే, రాజీనామాపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో అనేకమంది ఎమ్మెల్యేల రాజీనామాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. అయితే,, ఈటల విషయంలో అలా జరగకపోవచ్చు. ఆయన ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారా? అని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. సో, ఈటల ఇలా రాజీనామా చేయగానే.. అలా స్పీకర్ అమోదం లభిస్తుందని అంటున్నారు.
స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత గరిష్ఠంగా ఆరు నెలల్లోగా ఈసీ ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించవచ్చు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బైపోల్‌కు 6 నెలల కంటే అధిక సమయం పట్టడం చూస్తున్నాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన వివిధ ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తూ వస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా తగ్గుముఖం పట్టకపోతే, థర్డ్ వేవ్ దూసుకొస్తే.. హుజురాబాద్ ఉప ఎన్నికకు 6 నెలల కంటే ఎక్కువే సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే.. ఆ ఆలస్యం ఎంతనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే...
హుజురాబాద్ ఉప ఎన్నిక 6 నెలల్లోగా జరగకుండా మరింత ఆలస్యం అయితే.. పొలిటికల్ ఇంపార్టెన్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకవేళ బైపోల్ ఆలస్యమై.. వచ్చే ఏడాదిలో సెకండ్ హాఫ్‌లో జరిగితే.. అప్పటి నుంచి 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంటుంది. అంటే.. అసెంబ్లీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. హుజురాబాద్ బై ఎలక్షన్ సెమీ ఫైనల్‌లా మారే ఛాన్స్ ఉంది. అప్పుడు ఉప సంగ్రామం మరింత హోరాహోరీగా మారుతుంది. ఆ పరిణామాన్ని పలు రకాలుగా చూడాల్సి ఉంటుంది.
మరో ఏడాదిన్నర సమయమే ఉందిగా.. ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే ఏంటని.. ప్రజలు లైట్ తీసుకుంటే..? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి.. సర్కారు ఆగ్రహానికి గురైతే.. అభివృద్ధి ఆగిపోతుందనుకుంటే..? పెద్దోళ్ల పోరులో మనమెందుకు బలి కావాలని ఓటరు భావిస్తే..? అది ఈటలకు పెద్ద మైనస్‌గా మారుతుంది.
మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి.. ఈ ఉప ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని.. ఇప్పుడు ఓడిస్తే.. అప్పటికి సెట్ అవుతాడని.. గులాబీ బాస్ అహం దిగి.. ప్రగతి భవన్ వీడి.. ప్రజల మధ్యకు వస్తాడని.. కేసీఆర్‌కు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని భావిస్తే.. ఈటలను గెలిపించి.. దొర తలబిడుసుతనాన్ని తగ్గించాలని డిసైడ్ అయితే.. అది టీఆర్ఎస్‌కు తీరని నష్టాన్ని తీసుకొస్తుంది. దుబ్బాకలో అదే జరిగింది. అది హుజురాబాద్‌లోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే, హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం అయినా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ భవిష్యత్ పరిణామాలు అమాంతం మారిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. 6 నెలల లోపు ఎన్నికలు జరిగినా.. హోరాహోరీ మాత్రం తప్పదు.
అయితే, ఎమ్మెల్యే పదవికి త్వరగా రాజీనామా చేసి ఈటల బీజేపీలో చేరితే.. కేంద్రం తలచుకున్నప్పుడు హుజురాబాద్‌కు ఉప ఎన్నిక రావొచ్చనేది మరో పాయింట్. ముందుగానో, ఆలస్యంగానో.. హుజురాబాద్‌లో ఉప పోరు మాత్రం పక్కా. అటు కేసీఆర్, ఇటు ఈటల.. మధ్యలో బీజేపీ.. అంతా పంతం.. నీదా నాదా సై అంటుండటంతో.. హుజురాబాద్‌లో ఎప్పుడు ఉప పోరు జరిగినా.. రచ్చ రంబోలే....