హుజురాబాద్ లో కారుకు షాకేనా? ఈటలకు కలిసివస్తోంది ఏంటీ?
posted on Oct 18, 2021 @ 3:23PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరో 10 రోజుల్లో గడువు ముగియనుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అయితే హుజురాబాద్ ఓటర్ నాడి మాత్రం బయటపడటం లేదు. ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా హుజురాబాద్ ఓటర్ నాడి పట్టడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి మాజీ మంత్రి , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కే మొగ్గు ఉందని తెలుస్తోంది. సైలెంటుగా ఉన్న ఓటర్లంతా ఈటలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు.
ఎక్కడైనా అధికార పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్లు బహిరంగంగానే బయటపడుతుంటారు. ప్రభుత్వ పథకాలు అందాలి కాబట్టి ఓపెన్ గానే తమ సపోర్టు చెబుతుంటారు. సైలెంటుగా ఉన్నారంటే వాళ్లు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారనే సంకేతం వచ్చినట్లే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అదే జరిగింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అన్ని సర్వేలు మొదటి నుంచి క్లియర్ గా కారు గెలుస్తుందని చెప్పాయి. ఫలితం కూడా అలానే వచ్చింది. మెదక్ జిల్లా దుబ్బాకలో మాత్రం ఓటర్ల నాడి చివరి వరకు అంతుపట్టలేదు. అందుకే సర్వే సంస్థలు భిన్న అంచనాలు ఇచ్చాయి. ఫలితం మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు హుజురాబాద్ లోనూ దుబ్బాక లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు.
బీజేపీ అభ్యర్థికి విజయావకాశాలు ఉండటానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. గత 20 ఏండ్లుగా ఎమ్మెల్యేగా, ఏడేండ్లు మంత్రిగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలతో ఈటల రాజేందర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని గల్లీ లీడర్లను కూడా పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఈటలకు ఉంది. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చాలా శ్రమించారని చెబుతారు. అందుకే టీఆర్ఎస్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా అంతర్గతంగా ఈటలకు మద్దతు ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. పదవిలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో కొనసాగుతున్నారని.. పోలింగ్ రోజున సీన్ మరోలా
ఉంటుందని చెబుతున్నారు.
ఈటలకు సానుకూలంగా చాలా అంశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమంలో కీలకంగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్. ఉద్యమ సమయంలో ఎంతో మందిపై కేసులు నమోదు కాగా.. వాళ్లందరికి అండగా నిలిచారు ఈటల రాజేందర్. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సాయం చేశారు. అంతేకాదు పేద కుటుంబాలకు సొంత నిధులతో సాయం చేస్తూ వచ్చారు ఈటల రాజేందర్. ఇవన్ని ఆయనకు ప్లస్ కావచ్చని భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి రాజేందర్ ను భర్తరఫ్ చేయడాన్ని హుజురాబాద్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఎంతో మంది నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నా.. ఈటలను టార్గెట్ చేయడం ఎందుకనే ప్రశ్న వస్తోంది. మంత్రివర్గం నుంచి అగౌరవంగా తొలగించారనే సెంటిమెంట్ కూడా ఈటల రాజేందర్ పై ప్రజల్లో కనిపిస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులంతా ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది.
అయితే ఈటలకు ప్రతికూలంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఆయన అధికార పార్టీ కాకపోవడమే. కేసీఆర్ ప్రభుత్వం మరో రెండేళ్లు ఉంటున్నందున అధికార పార్టీ గెలిస్తే.. అభివృద్ధి పనులు బాగా జరుగుతాయనే అంశం ఈటలకు ఇబ్బందిగా మారింది. కొన్ని వర్గాల ప్రజలు ఈ దిశగా కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. దాంతో పాటు దళిత బంధు పథకంతో ఆ వర్గం దూరం కావచ్చని భావిస్తున్నారు. అయితే దళిత బంధు పథకంతో ఇతర వర్గాలు అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నాయని.. అది తమకు కలిసి వస్తుందని ఈటల టీమ్ లెక్కలు వేసుకుంటోంది.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నా.. ఈటలకు ఆయన సరితూగడనే అభిప్రాయం జనాల నుంచి వినిపిస్తోంది. అయితే గెల్ల్లుకు మంత్రి హరీష్ రావు ప్రధాన బలంగా మారిపోయారు. నియోజకవర్గమంతా హరీష్ సుడిగాలిలా పర్యటిస్తుండటంతో లాభిస్తోందని అంటున్నారు. అధికార పార్టీ కావడంతో విచ్చలవిడిగా వరాలు కురిపిస్తున్నారు హరీష్ రావు. కులాల వారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇవన్ని తమకు కలిసి వస్తాయని ఆశలో కారు పార్టీ నేతలు ఉన్నారు. దళిత బంధు పథకంతో ఆ వర్గ ఓట్లన్ని తమకే గంప గుత్తగా పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు గులాబీ లీడర్లు. అయితే ఈటలతో పోల్చినపుడు గెల్లు చాలా చిన్న నాయకుడని, అతన్ని కేసీఆర్ బలి పశువు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా హుజురాబాద్ ఓటర్లలో కనిపిస్తున్న సైలెంట్ మూడ్.. ఖచ్చితంగా బీజేపీ అభ్య్రర్థి ఈటల రాజేందర్ కే అనుకూలంగా ఉంటుందనే భావనే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.