నారి నారి నడుమ మురారి..
posted on May 6, 2021 @ 1:30PM
పెళ్లి చూడడానికి, పలకడానికి రెండు పదాలే కానీ, చాలా పవిత్రమైనది. దానికి మన దేశంలో పురాతనం నుండి ఒక ప్రత్యకమైన స్థానం ఉంది. రాను రాను పవిత్రమైన పెళ్లిని అపవిత్రం చేస్తున్నారు. కొంత మంది అయితే సోలోబతుకే సోబెటర్ అనుకుంటారు. మరికొంత మంది అయితే వద్దురా సోదర పెళ్లంటే నూరేళ్ళ మంటారా.. అంటూ పెళ్లి మీద పాటలు వచ్చాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రతి మనిషి లైఫ్ లో బాల్యం, యవ్వనం, ఒక భాగం అయితే పెళ్లి అనేది మరో భాగం, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి జీవితం పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అని చెప్పుకోవాలి.
ఏ ఆడపిల్లకు పెళ్లంటే ఎన్నో భయాలు ఉంటాయి. తల్లిదండ్రులను, బంధువులను, సొంత ఇల్లును వదిలి ఎవరో తెలియని వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండడానికి వెళ్తుంది. అలా వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ మోజులో పడి, భార్యను మరిస్తే.. సొంత తల్లిదండ్రులుగా చూడాల్సిన అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తుంటే… ఆ బాధలు తట్టుకోవడం కన్నా చావే పరిష్కారమనుకున్న ఓ యువతి.. తన తనువు చాలించింది. కూతురికి పెళ్లి చేసి పంపించామని సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.
తంజావూరు సమీపంలో ఉన్న తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణసుందరం చిన్న కుమార్తె భువనేశ్వరి (25)ను ఆర్కాడ్‌కు చెందిన కలియమూర్తి కుమారుడు రంగరాజ్ (30)తో ఏడాది క్రితం వివాహం అయింది. ఎన్నో ఆశలతో భువనేశ్వరి అత్తవారింట అడుగుపెట్టింది. కానీ ఆమె ఆశలు అడియాశలేనని ఆమెకు కొద్దీ రోజులోనే అర్ధమయ్యింది. పెళ్లై సంవత్సరం అవుతున్నా భర్త తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. చుట్టుపక్కల వాళ్లు భర్తకు, వేరే యువతితో సంబంధం ఉందని చెప్తుండడంతో షాకయ్యింది. దీంతోపాటు అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేసేవారు. ఈ బాధలను ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఈ నరకయాతన కన్నా చావే పరిష్కారమనుకొని మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.