గరికపాడు చెక్ పోస్ట్ తో రాజకీయాలు చేయవద్దు! క్వారెంటయిన్ వెళ్ళాల్సిందే!
posted on Mar 26, 2020 @ 10:30AM
హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న వాహనాలు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వందలాదిగా నిలిచిపోవడంతో ఆంధ్ర-తెలంగాణా సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. తెలంగాణా పోలీసుల నుండి అనుమతి పత్రాలతో వచ్చినా ఆంధ్ర పోలీసులు అంగీకరించలేదు. దీంతో వేలాదిగా వాహనదారులు రోడ్డుపై ఉండడంతో దాదాపు మూడు కి.లోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయి ఉద్రిక్తంగా మారింది. చీకటి పడటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నతాధికారులతో ఆంధ్ర పోలీసులు చర్చించారు.
ఆంధ్రాలోకి రావాలంటే నూజివీడు ఐఐఐటీలో 14 రోజులు ఉండాలన్న అధికారుల ఆంక్షలతో కొందరు విద్యార్థులు, ప్రయాణికులు వెనుదిరి వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాసిన విద్యార్థులను ప్రయాణికులను ఎట్టకేలకు ఆంధ్రా పోలీసులు వెనక్కు పంపించివేశారు.
విజయవాడ సబ్ కలెక్టర్ విద్యార్థులకు నచ్చజెప్పడంతో సుమారు 100మంది విద్యార్థులు ఐఐఐటీ లో ఉండేందుకు అంగీకరించారు.
కర్ఫ్యూ కారణంగా ఇకపై ఎవ్వరూ హైదరాబాద్ నుండి రావద్దని పోలీసులు ఆదేశించారు. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు కొందరికి వాహనాలు లేక పోవడంతో చెక్ పోస్టు వద్దే మరికొంత మంది కనిపించారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన 44 మందిని నూజివీడు క్వారంటీన్ కు బస్సుల్లో తరలించారు. అయితే క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించని 200 మందిని సురక్షితంగా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సొంత వాహనాలున్న వారు హైదరాబాద్ కి తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏపీ సరిహద్దు ప్రాంతంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోని కి అనుమతించడం లేదని ఎక్కడి వారు అక్కడే తమ నివాసాలకు పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ వైపు నుండి వచ్చే కార్లను తెలంగాణ చెక్ పోస్టు నుంచే పోలీసులు వెనక్కి పంపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రతలు పాటించడంలో భాగంగానే క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్ళాల్సిందేనని ఆంధ్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. విదేశీయులు, విదేశాల నుంచి వచ్చేవారు ఎక్కువగా వస్తువుంటారు కాబట్టి క్వారెంటయిన్ తరువాతే ఇళ్లకు వెళ్లమని చెప్పడంలో తప్పులేదు. అయినా దీనిపై కూడా రాజకీయాలు చేయడం దారుణం. మొత్తం ఆంధ్రప్రజల జీవితాలతో చెలగాటం ఆడడమే. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కఠనంగా వ్యవహరించడాన్ని అర్థం చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేయడంపై చర్చ అనవసరం అని ప్రజలు చెప్పుకుంటున్నారు.