అమరావతి గ్రామాల్లో పేదలకు లక్ష ఇళ్లు.. జగన్ వ్యూహం అదేనా?
posted on Nov 2, 2022 @ 10:47AM
ఏపీ సీఎం తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు విషయంలో అదే చేశారు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రైతుల పాదయాత్రను ఆపడానికి విశాఖ గర్జన పేర చేసిందీ అదే. ఇప్పుడు మరో భయంకరమైన కుట్ర రాజకీయానికి తెర లేపారు. అది కూడా పేదలకు ఇళ్లు అంటూ అమరావతి రైతులను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలకు దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
ఇందు కోసం ఆయన కోర్టు తీర్పును ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. అన్నిటికీ మించి ప్రాంతాల మధ్య చిచ్చు రగిలి రాష్ట్రం రావణ కాష్టం అయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నా లెక్క చేయడం లేదు. ఇంతకీ..ఆయన ఇప్పుడు కొత్తగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చడానికి వేసిన ఎత్తేంటంటే.. సకల విలువలకూ తిలోదకాలిచ్చేసి, కోర్టు తీర్పును సైతం బేఖాతరు చేసి.. సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి మరీ అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు అంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులకు సైతం ప్రకటన ఇచ్చేశారు. ఇందులో మతలబు ఏమిటంటే రాజధాని అమరావతి ప్రాంతంలో బయట వారికి స్థలాలు కేటాయించడానికి వీల్లేదని సీఆర్డీయే చట్టం చెబుతోంది.
సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. దానిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు సైతం వెళ్లింది. అక్కడ ప్రభుత్వ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సుప్రీం కోర్టు డైరెక్షన్ వచ్చే వరకూ హైకోర్టు తీర్పును కాదని జగన్ సర్కార్ ఏ విధంగానూ ముందడుగు వేయడానికి వీల్లేదు. అయితే జగన్ రూటే సెపరేటు. కోర్టు తీర్పును బేఖాతరీ చేసి రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇందు కోసం సీఆర్డీయే చట్టంలో సవరణ చేసింది. ఆ సవరణ మేరకే జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో, అలాగే తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనడమే కాకుండా ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేస్తూ నోటిఫికేషన్ కూడా జగన్ సర్కార్ ఇచ్చేసింది.
జోనింగ్లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. అభ్యంతరాలు సూచనలను సీఆర్డీఏ కార్యాలయంలో లేదా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయవచ్చని తెలిపింది. రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువుగా మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు, ప్రత్యేక అధికారులకు అధికారాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే చేసిన సీఆర్డీఏ చట్ట సవరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
నిజానికి ఈ వ్యవహారానికి జగన్ సర్కార్ గత ఏడాదే తెరలేపింది.
రాజధాని అమరావతి పరిధిలో పేదలకు భూములు కేటాయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసింది. అయితే.. తాము రాజధాని కోసం ఇచ్చిన భూములను పేదలకు ఇవ్వడం కూడదంటూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు అలా చేయడానికి వీల్లేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మార్పు చేస్తూ.. సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇది కూడా కోర్టు ధిక్కరణేనని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎవరూ అడ్డు చెప్పరు కానీ, అమరావతి పరిస్థితులు వేరు అన్నది గుర్తించాలని న్యాయనిపుణులు అంటున్నారు. రాజధాని కోసం ఏ ప్రాంతంలో ఏది నిర్మిచాలనే నిర్ణయాన్ని కాదని ఇష్టారీతిగా జీవోలు ఇచ్చి అమరావతిని నిర్వీర్యం చేసేందుకుజగన్ సర్కార్ కోర్టు ధిక్కరణకు సైతం వెనుకాడటం లేదనడానికి ఇది తాజా తార్కాణమని అంటున్నారు.
ప్రభుత్వ తాజా మూవ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందనీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు లంక దినకర్ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోక తప్పదని హెచ్చరించారు. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘిస్తోందని అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో జగన్ సర్కార్ ఇప్పుడు చేసిన మార్పు ఏపీ హైకోర్టు తీర్పు ఉల్లంఘనేనని పేర్కొన్నారు.