సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
posted on Jul 17, 2020 @ 3:29PM
తెలంగాణ ప్రస్తుత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగిపోయాయి. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్థానం కొట్టివేసింది. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చింది.
కూల్చివేతకు కేంద్రం అనుమతులు అవసరం లేదని, కొత్త నిర్మాణం చేప్పట్టే ముందు అనుమతులు తీసుకుంటామని సోలిసీటర్ జనరల్ కోర్టుకు వివరించారు. కొత్త భవనాల నిర్మాణానికి స్థలాన్ని సిద్ధం చేయడంలోనే భవవాల కూల్చివేత అంశం కూడా వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా ఎక్కువ ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది.
వారంరోజుల నుంచి ఉన్న స్టేను ఎత్తివేసింది హైకోర్టు. దీంతో ఇప్పటివరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్టయింది. ఇప్పటికే సగానికి పైగా భవనాలను కూల్చివేశారు. కూల్చివేతను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు మళ్ళీ జరగనున్నాయి.
ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టులలో కూల్చివేతను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేయడంతో సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. అయితే సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ అంశం విచారణకు రానుంది.