అమరావతే శాశ్వతం.. నేతల పాపం ఊరికే పోదన్న శివాజీ..
posted on Nov 18, 2021 @ 4:52PM
హీరో శివాజీ. గతంలో గరుడ పురాణం పేరుతో ప్రజల ముందుకొచ్చి సంచలనం సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వం వెనుక జరుగుతున్న కుట్రను బట్టబయలు చేశారు. అమరావతికి వీరాభిమాని. వైసీపీ అధికారంలోకి వస్తే.. ఎంత దారుణం జరుగుతుందో ముందే ఊహించిన వ్యక్తి. అమరావతిని మూడు ముక్కలు చేసే ప్రయత్నాన్ని గట్టిగా వ్యతిరేకించిన అసలైన ఆంధ్రుడు. తాజాగా, హీరో శివాజీ రాజధాని రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని ఏదో చేద్దామంటే సాధ్యం కాదని.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనన్నారు నటుడు శివాజీ. ఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి అని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల కుంపట్ల మధ్య ఏపీ ఏమి అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఎంత డబ్బులు పంచినా ఓటరు మాత్రం ఆత్మసాక్షికే ఓటేస్తారన్నారు. ప్రజలకు ఎవరికి ఓటేయాలో అర్థమైందన్నారు. నేతల పాపం ఊరికే పోదు.. వెంటాడుతోందన్నారు శివాజీ.
రాజధానిని అభివృద్ధి చేయాలనుకున్న వారు చేశారని, మరొకరు ఇంకొక మాట అంటున్నారన్నారు. బొత్స.. కొడాలి నాని.. వంటి మంత్రులు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు.. రాజకీయ నేతలు తాము శాశ్వతం అనుకుంటే కుదరదన్నారు. జనం సినిమాలో సీన్లను గుర్తు పెట్టుకున్నంతగా సమాజంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవటం లేదన్నారు. మీడియా కూడా వర్గాలుగా విడిపోయిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడంలేదన్నారు శివాజీ.