Read more!

మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్

వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటారు.  గతంలో ఒక సారి  శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయనీ, కరోనా నుంచి విముక్తి చెందామనీ చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.

ఆయన అలా  అని ఊరుకోలేదు.   క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందన్నారు.ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తి గత విశ్వాసం కావచ్చును. కానీ, ఆయన ఒక అధికారి, ఆవిషయం మరిచి పోయి చేసిన వ్యాఖ్య సహజంగానే అప్పట్లో దుమారం రేపింది. గత ఏడాది డిసెంబర్ లో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు   ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అంతే కాదు ప్రపంచానికి, అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమని,    ప్రపంచం  అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని కూడా అన్నారు.

అదే జోరులో  క్రైస్తవ మత ప్రచారానికి నడుంబిగించాలని కూడా సూచించారు.  నిజమే అప్పట్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సెమీ క్రిస్మస్ వేడుకలలో తన   విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అది కూడా వ్యక్తిగత హోదాలో హాజరైన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పోస్టులో ఉన్న ఆయన, తన విధుల్లో భాగమైన కరోనా మహమ్మారి కట్టడి జీసస్ క్రైస్ట్ దయవల్లే జరిగిందని చెప్పడం విమర్శలకు తావిచ్చింది.

 నిజానికి  శ్రీనివాసరావు మత విశ్వాసాల గురించి పెద్దగా తెలియక పోయినా  ఆయన రాజకీయ ఆశలు, ఆకాంక్షల గురించి మాత్రం ఆయన తన చేష్టల ద్వారా అందరికీ తెలిసేలా వ్యవహరిస్తుండటంకద్దు. గతంలోనూ ఆయన పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా వార్తల్లోకి ఎక్కారు.  అదొక వివాదం అయితే కరోనా నుంచి విముక్తి పొందడానికి ఏసుక్రీస్తు దయే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అది సర్దుమణిగిందనుకునే లోగానే.. తాజాగా అయన రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని అన్నారు.

కొత్తగూడెంలోపర్యటించిన సందర్భంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక విధమైన తన్మయత్వంతో మంత్రి హరీష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ సిద్ధిపేటకు చేసిన దానిలో సగంపనులు చేసిన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.