Read more!

కథ కంచికేనా? సజ్జల ఇంటికేనా?

వైసీపీ.. ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో ఏదో హడావుడి. విపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ కూడా ఏదో అలజడి. గందరగోళం. తమ అధినేతకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా ఏకమైపోయి ఏదో చేసేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆందోళన కనిపిస్తూనే వస్తోంది. ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్న తరువాత కూడా వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు తమ విధానాలు, తమ తప్పిదాలు కారణం కాదంటోంది. కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే విపక్ష నేత మేనేజ్ చేశారంటుంది.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేస్తే విపక్షం కోట్లు కుమ్మరించి వారిని ప్రలోభ పెట్టిందంటుంది. అంతే కానీ ప్రజలలో, లేదా పార్టీలో జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అంగీకరించదు. ఆయనపై కుట్ర జరుగుతోందనే చెబుతుంది. అదలా ఉంచితే.. వైసీపీ అధినేత జగన్ ను తమ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సే( ఎమ్మెల్యే కోటా, గ్యాడ్యుయేట్) ఎన్నికలలో ఓటమి ఉక్కపోతకు గురి చేస్తోంది. ఈ ఓటమితో ఇప్పటి వరకూ పడిపోతున్నది మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫే అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు పార్టీ వ్యూహాత్మకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఒక పథకం ప్రకారం పార్టీ ప్రస్తుత పరిస్థితికి, పార్టీలో అసంతృప్తికీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమికీ, ఇంకా ఏమైనా ఉంటే అన్నిటికీ సజ్జలే కారణమన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో వ్యూహాత్మకంగా మొదలైంది. ఎందుకంటే..  సకల శాఖల మంత్రిగా  రాష్ట్రం మొత్తానికి సజ్జల చిరపరిచితుడే. పార్టీలో ఏం జరిగినా సజ్జల కనుసన్నలలోనే జరుగుతుంది.

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకైనా ఉండేది సజ్జలే.  పార్టీ నిర్ణయాలైనా, ప్రభుత్వ నిర్ణయాలైనా  మంత్రులు, అధికారులు కాదు సజ్జలే మీడియా ముందుకు వచ్చి చెబుతారు. ఆఖరికి జగన్ కుటుంబంలో పరిణామాలపై వివరణ ఇచ్చినది కూడా సజ్జలే. షర్మిల కొత్త పార్టీ పెట్టిన సమయంలో కానీ, విజయమ్మ రాజీనామాపై స్పందించడం కానీ అన్నీ సజ్జలే చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ శాఖల, నియోజకవర్గాల సమస్యల గురించి ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలన్నా సజ్జల అనుమతి ఉండాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసే జీవోల వెనుక ఉండేదీ సజ్జలే.  అసలు ఇదంతా ఎందుకు.. విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో వైపీసీ అధినేత జగన్ ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వచ్చేవారు. వారు తమ సమస్యలపై నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వారికి నేరుగా హామీలిచ్చే వారు, భరోసా ఇచ్చేవారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నోట నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాట రావడం లేదు. సజ్జల ఉన్నారు.. సజ్జల వింటారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అసంతృప్తికి  కారణం సజ్జలేన్న ప్రచారం పకడ్బందీగా మోదలైంది.  అంటే సకల శాఖల మంత్రిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల పార్టీలో మంచికీ చెడుకీ కూడా కారణభూతుడిగా మారిపోయారు. స్పష్టంగా చెప్పాలంటే.. ఫేస్ ఆఫ్ వైసీపీ జగన్ అయితే ఫేట్ ఆఫ్ వైసీపీ సజ్జల అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అందుకే గత ఏడాది ఏప్రిల్ లో జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వెల్లువెత్తిన అసంతృప్తి, అసమ్మతి నేరుగా జగన్ కు తాకకుండా సజ్జల దగ్గరే ఆగిపోయాయి. అప్పట్లో అయితే అసమ్మతి ఒక్కసారిగా ఎగసిపడి తాటాకు మంటలా ఆగిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవాలు, పార్టీ ఎమ్మెల్యేలలోనే వెల్లువెత్తుతున్న అసమ్మతి, అసంతృప్తి అలాగే సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్యేల ఆగ్రహం, ఆక్రోషం అంతా హు ఈజ్ సజ్జల..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సామాన్య జర్నలిస్టు అయిన సజ్జల ఇన్ని కోట్ల ఆస్తులెలా కూడబెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కోసం కోట్లు చేతులు మారాయంటూ సజ్జల చేసిన విమర్శలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.  ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ఈ నేపథ్యంలోనే సజ్జల వ్యూహాలకు అనుగుణంగానే ఇప్పటి దాకా జగన్ పాలన సాగిందన్న పరిస్థితి నుంచి, ఇప్పుడు పార్టీలో సజ్జలకు వ్యతిరేకంగా పకడ్బందీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నట్లు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి జగన్ బయటపడాలంటే.. సజ్జలపై వేటు వేడయమే మార్గమన్నట్లుగా వైసీపీ భావిస్తోంది. తొలి నుంచీ వైసీపీ వ్యూహాలు అలాగే ఉన్నాయి. మంచి అంతా జగన్ ఖాతాలో, తప్పులన్నీ వీలైతే విపక్షాల ఖాతాలో.. అది కుదరకపోతే పార్టీలోనే కీలకంగా ఉన్న వ్యక్తి మీదకు నెట్టేయడం. గతంలో విజయసాయి. పార్టీలో నంబర్ 2గా ఉన్న సమయంలో సర్వం ఆయనే అనేటట్లు ఉండేది పరిస్థితి. ఆ తరువాత విజయసాయి పరిస్థితి ఏలా మారిందో అందరికీ తెలుసు. విజయసాయి తరువాత ఆ స్థానంలోకి వచ్చిన సజ్జలపై ఇప్పుడు కత్తి వేలాడుతోందని అంటున్నారు. ఇటీవలి పరిణామాల తరువాత పార్టీ నేతలే మీడియా ముందుకు వచ్చి  తప్పు సజ్డలదేనని, సీఎం జగన్‌కు ఏమీ సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ ప్రచారం చాలా చాలా చిన్నగానే ఉన్నా.. రానున్న రోజులలో ఇది మరింత ఉధృతం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   సజ్జల తప్పుడు నిర్ణయాల కారణంగానే జగన్ పై విమర్శలు వస్తున్నాయన్నట్లుగా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇంత కాలంగా ప్రతిపక్షాలపై జరిగిన దాడులు, బనాయించిన కేసులు అన్నిటి వెనుకా ఉన్నది సజ్జలే అని ఎస్టాబ్లిష్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆ దిశగా ప్రచారమూ ఆరంభమైంది. అంతా సజ్జలే చేశారు. వైసీపీ ఫేస్ జగన్ దే అయినా, ప్రస్తుత పార్టీ ఫేట్ కు మాత్రం సజ్జలే కారణం అంటూ  వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.   అన్నిటికీ మించి పార్టీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటకు రావాలంటే సజ్జలను బలి చేయడమే మార్గమన్న నిర్ణయానికి వైసీపీ వచ్చేసిందనీ, అది జరిగితేనే.. జగన్ తాను సజ్జలను నమ్మి మోసపోయానన్న నిజం తెలుసుకుని ఇప్పటి వరకూ జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటారన్న అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే అవకాశం ఉందని పార్టీ ఒక నిర్ణయానికి  వచ్చేసిందని అంటున్నారు.  

పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు ఎలాగూ సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ కూడా అదే కంటిన్యూ చేస్తే... ఇక జగన్ పై పడిన మచ్చలన్నీ చెరిగిపోతాయన్నది వైసీపీ నేతల భావనగా కనిపిస్తోంది.   అయితే ఇదంతా పార్టీలో సజ్జల వ్యతిరేకుల వ్యూహమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికింకా పార్టీ మొత్తం సజ్జల గుప్పెట్లోనే ఉంది. సజ్జల వ్యతిరేకులు తమంతట తాముగా సజ్జలను విమర్శిస్తూ గళం విప్పే అవకాశం లేదు.  జగన్ స్వయంగా.. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి   సజ్జలను టార్గెట్ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉంటారని పరిశీలకుల అంటున్నారు.  అన్నిటికీ మించి జగన్ కు తాను వినా పార్టీలో మరెవరూ గుర్తింపు పొందడానికి ఇష్టపడరని ఆయన నైజం తెలిసిన వారు అంటున్నారు. విజయసాయి రెడ్డి,   వైవీ సుబ్బారెడ్డి,  ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎవరైనా ఆ తరువాత డమ్మీలుగా మారిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సజ్జల వంతు అని చెబుతున్నారు. వైసీపీలో సజ్జల కథ కంచికి చేరిందనీ, ఆయన ఇంటికి చేరడమే తరువాయనీ అంటున్నారు.