క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేను తొలగించిన బిసిసిఐ..!
posted on Apr 10, 2016 @ 9:18PM
క్రికెట్ రెగులర్ గా ఫాలో అయ్యేవారందరికీ హర్షా భోగ్లే అన్న పేరు తెలిసే ఉంటుంది. క్రికెట్ కామెంటరీ చేయడంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం హర్ష సొంతం. కామెంటరీ చేయడంలో తిరుగులేని అనుభవమున్న హర్షకు బిసిసిఐ ఝలక్ ఇచ్చింది. ఆల్రెడీ ఐపిఎల్ సీజన్ 9 కు ఆయన్ను బుక్ చేసినప్పటికీ, ఆయన్ని తొలగిస్తూ ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హర్షా భోగ్లేపై క్రికెటర్ల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని బిసీసీఐ చెబుతున్నప్పటికీ, దీని వెనుక వేరే కారణాలున్నట్లు తెలుస్తోంది.
టి20 వరల్డ్ కప్ సమయంలో, భోగ్లే ఇండియాకు కాకుండా బంగ్లాదేశ్ కు అనుకూలంగా మాట్లాడారంటూ, పేరు చెప్పకుండా ఆయనపై విమర్శలు చేశారు అమితాబ్ బచ్చన్. దానికి ప్రతిగా, తాను వ్యాఖ్యానం చేసే ఛానల్ ఫీడ్ వరల్డ్ వైడ్ వెళ్తుందని, అందుకే తాను అందరి తరపున మాట్లాడాలంటూ హర్షా కూడా ఇన్ డైరెక్ట్ గానే క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. వరల్డ్ టి20 సమయంలో నాగ్ పూర్ మ్యాచ్ లో హిందీ ఇంగ్లీష్ కామెంటరీ బాక్స్ లకు మధ్యలో విఐపీ బాక్స్ నుంచి దారి ఉండేది. కానీ దాన్ని మూసేయడంతో ఒక కామెంటరీ బాక్స్ మెట్లు దిగి, మరో కామెంటరీ బాక్స్ మెట్లు ఎక్కుతూ కామెంటేటర్స్ చాలా అలిసిపోయేవారట. ఈ విషయమై అక్కడి అధికారితో హర్షా భోగ్లే గొడవపడ్డాడు. ఆ బోర్డ్ బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కంట్రోల్ లో ఉంది. ఈ కారణంగానే హర్ష పై వేటు పడిందనేది అసలు కారణమంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఐపిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచీ హర్షా భోగ్లే కు ఈ టోర్నీతో అనుబంధముండటం విశేషం.