హరీష్ రాజీనామా చేయాలి..మాణిక్యం ఠాకూర్ డిమాండ్
posted on Sep 2, 2022 @ 11:53AM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కు.ని ఆపరేషన్లు వికటించడం ఘటన దుమారం రేపుతోంది. ఈ సంఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యంఠాకూర్ ట్విటర్‌లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందారని ఇప్పటికే ప్రజల నుంచీ భారీ విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. పోర్చుగల్‌లో భారతీయ గర్భిణి మృతికి బాధ్యత వహిస్తూ అక్కడి వైద్యశాఖ మంత్రి తన పదవికి రాజీ నామా చేశారని, ఇక్కడ వైద్యశాఖ హరీష్ రాజీనామా చేయాలని మాణిక్యం డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుం బ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై ముగ్గురు మహిళలు మృతి చెందారని.. మరికొందరి పరిస్థితి విష మంగా ఉందంటూ మీడియా వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనకు దారి తీసిన కారణాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించి అక్టోబర్ పది నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఇవ్వాలని ఆదేశించింది.
ఇక ఇబ్రహీంపట్నం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటనపై నివేదిక వచ్చే వరకు క్యాంపులను నిలిపివేయా లని ఆదేశించింది. నివేదిక వచ్చాకే కుటుంబ నియంత్రణ క్యాంపుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రోజుకు 15 ఆపరేషన్లు మాత్రమే చేయాలని గతంలోనే నిబంధన ఉండగా.. అదేమీ పట్టిం చుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆపరేషన్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నం లోనే గంట వ్యవధిలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు డాక్టర్లు.