అమరావతి విషయంలో సోము వీర్రాజుకు బిగ్ షాక్..!
posted on Aug 10, 2020 @ 6:19PM
నిన్న అమరావతిలో దీక్ష చేస్తున్న రైతుల శిబిరానికి చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేత వెలగపూడి రామకృష్ణ అక్కడ రైతులకు తన పూర్తి సంఘీభావం తెలిపారు. అదే సమయంలో కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అంతే కాకుండా రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తన చెప్పుతో తానే కొట్టుకోవడం జరిగింది. ఐతే రామకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ కొత్త అధ్యక్షులు సోము వీర్రాజు ఇది పార్టీ నిర్ణయానికి విరుద్దమంటూ ఆయనను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేసారు. దీంతో అటు అమరావతి రైతులు ఇటు జేఏసీ నాయకులు షాక్ కు గురయ్యారు. ఐతే తాజాగా ఇదే విషయంలో ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు పెద్ద షాక్ తగిలింది.
గత కొద్ది నెలలుగా ఢిల్లీ స్థాయిలో అమరావతి రైతుల తరుఫున పోరాడుతూ జేఏసీ ప్రతినిధులను అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలవద్దకు తీసుకెళుతూ అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ జివిఆర్ శాస్త్రి కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమరావతి కోసం నిరంతరం గొంతెత్తి పోరాటం చేస్తున్న డాక్టర్ శాస్త్రి ప్రస్తుతం అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శాస్త్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పెద్ద షాక్ ఇచ్చారు. నిన్న బీజేపీ నుండి సస్పెండ్ అయిన వెలగపూడి రామకృష్ణ ను ఆయన హిందూ మహాసభ ఎపి అధ్యక్షుడిగా నియమించారు.
ఇది ఇలా ఉండగా ఈ రోజు రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయని పాలెం ప్రాంతంలో రాజధాని రైతులు, మహిళలు సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నుండి సస్పెన్షన్‌కు గురి అయిన వెలగపూడి గోపాలకృష్ణ ప్రధాని మోదీ, అద్వానీ, ఎన్టీఆర్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి బీజేపీ పార్టీ తనను బయటకు పంపిందన్నారు. ఐతే రైతులను ఇబ్బంది పెట్టి బలపడదామని అనుకోవడం మంచిది కాదని అయన పార్టీ నేతలకు హితవు పలికారు. హిందూ మహాసభ అద్వర్యంలో దక్షిణ అయోధ్యగా అమరావతిని చేయడానికి తానూ కృషి చేస్తానని అయన అన్నారు. అంతే కాకుండా వెంకటపాలెంలో నిర్మించే శ్రీవారి ఆలయం పూర్తి స్థాయిలో నిర్మించాలని కూడా ఉద్యమిస్తామని అయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ సహకారం కూడా తాము కోరుతున్నామన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర బీజేపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం చెబుతానని గోపాలకృష్ణ తెలిపారు.