బాలినేనికి గుప్తా దెబ్బ.. మామూలుగా లేదుగా?!
posted on Mar 4, 2023 @ 11:45AM
నిజం నిష్టూరంగానే ఉంటుంది. అందుకే యాదార్థవాది లోక విరోధి అన్నారు పెద్దలు. వైసీపీలో అసమ్మతి నేత సుబ్బారావు గుప్తా విషయంలో దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా గుప్తాను రెండు రోజుల కిందట ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సోదాల్లో ఆయన వద్ద గంజాయి దొరికిందని అందుకే అరెస్ట్ చేశామని చెబుతున్నారు. అయితే దీనితో తనకేం సంబంధం లేదని సుబ్బారావు గుప్తా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాపు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.
మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు సుబానీ అండ్ గ్యాంగ్.. ఇటీవల ఒక మహిళా హాస్టల్‌పై చేసిన దాడిపై సుబ్బారావు గుప్తా సీరియస్‌గా స్పందించడమే కాకుండా.... బాలినేని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుబ్బారావు గుప్తా ఇలా స్పందించిన రెండంటే రెండు రోజులకే ఆయనను అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డీపై సుబ్బారావు గుప్తా చేస్తున్న విమర్శలు కూడా ఈ అరెస్టుకు ఒక కారణమా అన్న అనుమానం ఒంగోలు వాసులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే తన తడాఖా ఏమిటో... అబ్బా కొడుకులకు టన్నులు టన్నుల కొద్ది చూపిస్తానంటూ సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక 2021, డిసెంబర్‌లో నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్బంగా స్థానిక ఫ్యాన్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న మన పార్టీ చర్యల వల్ల ఇతర పార్టీల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... భవిష్యత్తలో మరో పార్టీ అధికారంలోకి వస్తే.. మన పార్టీ శ్రేణులు పరిస్థితి ఏమిటనేది ఓ సారి ఆలోచించాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీలోని ఇతర నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో సుబ్బారావు గుప్తా ప్రాణ భయంతో గుంటూరులోని ఓ లాడ్జిలో దాక్కుంటే.. బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ తన గ్యాంగ్‌తో కలసి.. లాడ్జిలో దాక్కొన్న గుప్తా పట్టుకొని బండ బూతులు తిడుతూ.. తీవ్రంగా దాడి చేసి.. మోకాళ్లపై కూర్చొబెట్టి... వాసన్నకు సారీ చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో నాడు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసింది.
ఆ తర్వాత బాలినేని శాంతించి.. సుబ్బారావు గుప్తాను తన ఇంటికి పిలిపించుకొని.. అతడికి కేకును మంత్రిగారే స్వయంగా తినిపించినా.. అప్పటికే బాలినేనికి వ్యక్తిగతంగా ఎంత నష్టం జరగాలో అంతా నష్టం జరిగిపోయిందని ప్రచారం సైతం సాగింది. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాపై దాడిని పలు ప్రజా సంఘాలు బహిరంగంగా ప్రశ్నించడంతో.. చేసేది లేక.. సుభానీపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఇక సుబ్బారావు గుప్తా.. వివిధ పార్టీల నాయకులనే కాదు... పలు సంఘాల నేతలను సైతం స్వయంగా కలిసి.. తనపై జరిగిన దాడిని వివరించారు. అంతేకాదు తనపై దాడికి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కూడా దిగారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు.
మరో వైపు ప్రెస్‌మీట్ పెట్టి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతానని ప్రకటించమే కాదు.. ప్రెస్ మీట్ పెట్టి బండబూతులు తిట్టకుండా.. మా ఎమ్మెల్యే బాలినేని లాగా చాలా సాప్ట్‌గా కనిపిస్తూ.. చేయాల్సిన వ్యవహారమంతా కామ్‌గా చేసుకుపోవాలంటూ అప్పటి మంత్రి కొడాలి నానికి హిత బోధ చేయడమే కాకుండా, ఈ విషయంలో మా ఎమ్మెల్యే వాసన్న వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటూ కొడాలి నానికి ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.
అయితే సుబ్బారావు గుప్తాపై బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ దాడి చేసిన వీడియో కారణంగా.. బాలినేనిపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వచ్చిందనే ఓ ప్రచారం అయితే అప్పట్లో చాలా గట్టిగానే జరింగింది. ఆ కారణంగానే పా బాలినేనికి అప్పటి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఊడిందన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది.
మరోవైపు జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయని సమాచారం. ఇక ఒంగోలులో సైతం బాలినేనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇది ఇటీవల బాలినేని నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని ఆయన వర్గమే స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేనికి వచ్చే ఎన్నికల్లో సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ వల్ల చాలా గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందనే ఓ ప్రచారం అయితే ఒంగోలు నియోజకవర్గంలో వాడి వేడిగా సాగుతోంది.