2 సార్లు టికెట్ క్యాన్సిల్ .. మూడోసారి తిరిగిరాని లోకాలకు
posted on Jun 14, 2025 @ 5:06PM
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ విషయంలో విధి వక్రీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ప్రయాణానికి సంబంధించి అదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లండన్‌లో ఉన్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు వెళ్తున్న రూపాణీ.. అంతకుముందు రెండుసార్లు వెళ్లేందుకు సిద్ధమై టికెట్ రద్దు చేసుకున్నారంట. చివరకు మూడోసారి బయలుదేరినప్పటికీ గమ్యాన్ని చేరకముందే విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఆయన లక్కీ నంబర్‌గా భావించే 1206 సంఖ్య కలిగిన తేదీనే ఆయనకు చివరి రోజయ్యింది. రూపాణీ వ్యక్తిగత వాహనాలన్నీ అదే నంబరుతో ఉన్నట్లు సమాచారం.
విజయ్ రూపాణీ ఆయన భార్యతో కలిసి మే నెలలోనే లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా 171 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకున్న ఆయన.. తన భార్యను అక్కడికి పంపించారు. జూన్ 5న వెళ్లేందుకు మళ్లీ బుక్ చేసుకున్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఆ టికెట్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. బీజేపీ పంజాబ్ ఇన్‌ఛార్జీగా ఉన్న రూపాణీ.. లుధియానా ఉపఎన్నిక నేపథ్యంలోనే తన ప్రయాణాన్ని రెండుసార్లు విరమించుకున్నట్లు తెలుస్తోంది. చివరకు జూన్ 12 లండన్‌కు ప్రయాణమైన రూపాణీ.. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్‌కు సమీపంలోని ఆనంద్ ప్రాంతానికి చెందిన మోనాలి, సన్నీ దంపతులు కూడా విమాన ప్రమాదంలో మృతిచెందారు. లండన్‌కు వెళ్లేందుకు వీరు జూన్ 6నే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్నారు. చివరకు 12వ తేదీన ఎయిరిండియా విమానంలో బయలుదేరిన వారిద్దరు కానరాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారి బంధువులు వాపోతున్నారు.