పార్టీపై పట్టు పోయిందా! జగన్ చెప్పినా చల్లారని సెగలు
posted on Oct 18, 2020 @ 6:03PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో క్రమశిక్షణ లోపించిందా? వైసీపీ నేతలు హైకమాండ్ ను ఖాతరు చేయడం లేదా? పార్టీపై వైఎస్ జగన్ పట్టు కోల్పోయారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవి నిజమేనని తేలుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ నాయకులు కుమ్ములాటలకు పాల్పడుతున్నారు. ఏదో ఒక వివాదంతో ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. స్వపక్షంలో విపక్షంలా బాహాబాహీకి దిగుతున్నారు. ఆధిపత్యం చేలాయించేందుకు గ్రూపు తగాదాలకు తెరలేపుతున్నారు. ప్రధానంగా వలస నేతలు, పాత నేతల మధ్య వివాదాలు అగ్గిరాజేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ను నేతలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అధినేత జగన్ చెప్పినా కొందరు నేతలు డోంట్ కేర్ అంటున్నారట. వైసీపీలో జరుగుతున్న పరిమాణాలతో పార్టీపై జగన్ పట్టు కోల్పోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
పౌరుషాల గడ్డ గుంటూరు జిల్లా పల్నాడులోనూ వైసీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. తన నియోజకవర్గంలోకి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును అడుగు పెట్టనివ్వకుండా ఎమ్మెల్యే రజనీ, ఆమె అనుచరులు ప్రయత్నించారని సమాచారం. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారివద్దకు ఎంపీ వెళుతున్నారని రజనీ వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావుఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే రజనీ పార్టీ అధిష్టానానికి తెలియచేసారు. తన ఫోన్లను పోలీసులతో కలిసి ఎంపీ ట్యాపింగ్ చేయించారని రజనీ ఆరోపిస్తున్నారు. వివాదం ముదరడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. జగన్ చెప్పినా ఇద్దరు నేతలు వినడం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. మూడు వర్గాలు ఆధిపత్యం కోసం కత్తులు దూస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశి, డీసీసీబీ చైర్మెన్ యార్లగడ్డ మధ్య రాజీకి జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. కలిసి పనిచేయండని వంశి, వెంకట్రావుల చేతులు కలిపి జగన్ పంపించినా వారు కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ సమావేశం తర్వాత కూడా వల్లభనేని, యార్లగడ్డలు ఒకరిపై ఒకరు కాలు దువ్వూతూనే ఉన్నారు. తానే వైఎస్సార్‌సీపీకి అసలు నాయకుడినని.. వంశీ అద్దె నాయకుడని యార్లగడ్డ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. వంశీతో కలిసి పని చేయనని సీఎం జగన్ కి చెప్పేశానని కూడా చెబుతున్నారట. వంశీ దొంగ ఓట్లతో గెలిచాడని చె యార్లగడ్డ ఆరోపిస్తుండటం.. వల్లభనేని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పార్టీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వంశీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆమంచి, ఎమ్మెల్యే కరణం వర్గాలు బలప్రదర్శనకు దిగుతున్నాయి. రెండు వర్గాల హంగామాతో ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా హై టెన్షన్ తలపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమంచే ఎమ్మెల్యేగా హడావుడి చేస్తున్నారని కరణం వర్గీయులు ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం అధికారిక కార్యక్రమానికి వెళ్లినా తన వర్గీయులతో నానా యాగీ చేయించేవారని ఆక్రోశిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు కరణం వెంకటేష్ ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దర్శి నియోజకవర్గ వైసీపీలోనూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రకాశం జిల్లా నేతల మధ్య సఖ్యతకు జిల్లా మంత్రి ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదట.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో రాజకీయం రాజుకుంటుంది. సీనియర్ నాయకుడు కోలా గురువులు వర్గంతో పాటు మరో వర్గం ఉంది. ఇప్పటివరకు ఎమ్మెల్యే వాసుపల్లిని వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు ఆయన వెనక తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న వైరంతో ఇప్పుడు తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతారనే భయం వారిని వేధిస్తుందట. గతంలో కార్పొరేటర్ల టిక్కెట్ల కోసం పార్టీలో కుమ్ములాటలు కలకలం రేపాయి. మరోవైపు ఎమ్మెల్యే కుమారులు కార్పొరేటర్లుగా పోటిచేస్తారన్న ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల కోసం అధికార పార్టీలో కార్పొరేటర్ల మధ్య పోటి పెరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలు అగ్గిరాజేస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య విభేదాలు ముదురుతున్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ ఉన్నారు. అయితే కేజే కుమార్ భార్య కేజే శాంతిని రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం వైసీపీలో కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతోనే కె జె కుటుంబానికి ఈ అవకాశం దక్కినట్లు గా రోజా వర్గం భావిస్తోంది.తనకు చెక్ పెట్టేందుకే తన ప్రత్యర్థి వర్గానికి కీలక పోస్టులను మంత్రి పెద్దిరెడ్డి ఇప్పిస్తున్నారని రోజా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్దిరెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు నగరి ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రోజాకు నచ్చ చెప్పలేక.. అటు సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డితో మాట్లాడలేక వైసీపీ ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నారని సమాచారం.
సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో హైకమాండ్ సుప్రీంగా ఉంటుంది. కాని వైసీపీ నేతలు పార్టీ నిర్ణయాలకు భిన్నంగా ప్రవర్తిస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు వైసీపీ సర్కార్‌లో ఎందుకు కనిపించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ లేకుండా పోతోందని,, వారిని గాడిలో పెట్టడంలో జగన్ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఏపీలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో పార్టీపై... ముఖ్యమంత్రి జగన్ పట్టు కోల్పోయినట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ నేతలను కంట్రోల్ చేసే స్థితిలో జగన్ లేరని చెబుతున్నారు.