'వధువు కావలెను'.. షాపు ముందు బోర్డు.. విదేశాల నుంచీ ఫోన్లు..
posted on Sep 1, 2021 @ 4:18PM
ఇతని పేరు ఉన్నికృష్ణన్. వయసు 33 ఏళ్లు. ఉండేది కేరళలో. చూట్టానికి బాగానే ఉంటాడు. సొంత షాపు కూడా ఉంది. అయినా, అతనికి పెళ్లి కావడం లేదు. తెలిసిన వారికి, కలిసిన వారికి.. అందరికీ తనకో సంబంధం చూడమని చెబుతున్నాడు. అయినా, ఏదీ వర్కవుట్ కావట్లేదు. చాలా కాలం వేచి చూసి.. ఇక విసుగెత్తి.. వేసారిపోతుండగా.. అతనికో అద్బుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుందని అనుకున్నాడు. ఆ పనితో తొందరలోనే తన పెళ్లి అయిపోతుందని భావిస్తున్నాడు. అయితే, ఇంకా పెళ్లైతే ఫిక్స్ కాలేదు కానీ.. అతగాడికి మాంచి పాపులారిటీ మాత్రం వచ్చేసింది. సొంతూరు, రాష్ట్రం, దేశం అనే కాదు.. వివిద దేశాల్లోనూ ఉన్ని కృష్ణన్ గురించి తెలిసి.. అతనికి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇంతకీ అతను చేసిన పనేంటంటే....
`వధువు కావలెను`.. అంటూ ఏ పేపర్లోనో, మ్యాట్రిమోనీ సైట్‌లోనే ప్రకటన ఇవ్వకుండా.. నేరుగా తన షాపు ముందు బోర్డు పెట్టాడు. కులం, మతంతో సంబంధం లేదంటూ.. ఆ బోర్డ్ పై తన ఫోన్ నంబర్ కూడా రాశాడు. షాపు కొచ్చిన వాళ్లంతా అది చూసి.. తమకు తెలిసిన వారందరికీ సంబంధం చూడమని చెప్పేవాళ్లట. కస్టమర్లలో ఒకరు.. వధువు కావలెను.. అనే బోర్డును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే. ఉన్నికృష్ణన్ బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. షేర్ల మీద షేర్లు కావడంతో.. ఆ పోస్ట్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ బోర్డు మీద ఉన్న ఆయన నెంబర్‌కు.. తెలిసిన సంబంధం ఉందంటూ.. తెగ ఫోన్లు వస్తున్నాయట. ఉన్ని క్రిష్ణన్ వివరాలు ఆరా తీస్తున్నారట. కేరళతో పాటు వేరే రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి కూడా ఫోన్ చేసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారట. సోషల్ మీడియా పుణ్యాన.. తను పెట్టిన బోర్డు కారణంగా.. దెబ్బకు కుప్పలు తెప్పలుగా పెళ్లి సంబంధాలు వచ్చి పడుతుండటంతో మనోడు తెగ ఖుషీ అవుతున్నాడట. అయితే, అవన్నీ తన స్థాయికి మించిన మ్యాచెస్ కావడంతో.. తనకు తగ్గ అమ్మాయి కోసం ఓపికగా అన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాడట.
`నేను గతంలో కూలి పని చేసేవాడిని. ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. నా తలలో కణతి ఉండటంతో గతంలో సర్జరీ జరిగింది. ఇప్పుడు కోలుకున్నా. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. ఎక్కడా సెట్ కాలేదు. అందుకే ఇలా బోర్డ్ పెట్టాను. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కొంత మంది మామూలుగా కాల్ చేసి `ఆల్ ది బెస్ట్` చెబుతున్నార`ని ఉన్నికృష్ణన్ అంటున్నాడు.