Read more!

అబద్ధాల పుట్ట.. తప్పుల తడక.. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ బాకా ఊదడానికే పరిమితమైందని విపక్షాలు విమర్శించాయి. ఎంత సేపూ ప్రభుత్వ పథకాలను ఆకాశానికి ఎత్తేయడమే తప్ప రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం లేదని దుయ్యబట్టాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ధరణి పోర్టల్ వంటి అంశాలు గవర్నర్ ప్రస్తావించనే లేదన్నారు.

సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్ట అని అభివర్ణించారు. ఈ ప్రసంగం చేయడం కంటే గవర్నర్ ప్రసంగం లేకుండా గత ఏడాది మాదిరిగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఆమె ప్రసంగం మొత్తంలో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావనకైనా రాలేదని నిలదీశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అంటూ చెప్పడం శుద్ధ అబద్ధమని జీవన్ రెడ్డి అన్నారు.

అలాగే  దళితబంధు పేరుతో దళితుల్నిప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ తమిళిసై ప్రసంగం మొత్తం తప్పుల తడక అని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అన్నదిపూర్తిగాఅవాస్తవమని, ఎక్కడా వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందడం లేదన్నారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ గురించి గవర్నర్ ప్రసంగంలో అసలు మాట్లాడనేలేదని ఈటల అన్నారు.