టీడీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత అని హోరెత్తిస్తున్న సోషల్ మీడియా.. ఖండించిన ఎమ్మెల్యే
posted on Sep 28, 2020 @ 6:20PM
గత కొద్ది నెలలుగా టీడీపీ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో టీడీపీని వీడి జగన్ సారధ్యంలోని వైసిపికి మద్దతు తెలుపుతున్న సంగతి తెల్సిందే. కొద్ది రోజుల క్రితం విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా జగన్ కు జై కొట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నుండి ఎవరు ఎపుడు పార్టీ మారతారో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ వైపు నుండి అధికార పక్షమైన వైసిపిని ఎదుర్కోవడంలో ముందుండే సీనియర్ నేత, ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేశారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ వెలుపల అయినా తన శక్తివంచన లేకుండా పార్టీ కోసం పోరాటం చేసే ఆయన రాజీనామా వార్తతో కొంత గందరగోళం నెలకొంది.
అయితే తాజాగా బుచ్చయ్య చౌదరి ఈ వార్త పై స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. ఇప్పటికే అందరూ అయిపోయారు.. ఇక మిగిలింది సాక్షాత్తు ప్రధాని మోదీ మాత్రమే అనుకుంటా అని బుచ్చయ్య చౌదరి సెటైర్ వేశారు. "ఇంకెందుకు లేటు. వైసీపీలోకి ప్రధాని కూడా వస్తున్నారంటూ ఆయన మీద కూడా వేసేయండి. మీరు ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా మీకు 5 రూపాయలు మాత్రమే వస్తాయి" అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనపై వచ్చిన వార్త ఫేక్ అని అయన కొట్టిపారేశారు.