పసిడి ఫసక్.. గోల్డ్ బిజినెస్ ఢమాల్..
posted on May 15, 2021 @ 12:42PM
ఓవైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్. కొవిడ్ సెగ బంగారం అమ్మకాలపై భారీగా పడింది. ఇప్పటికే పెళ్లిళ్ల గిరాకీ తగ్గగా.. తాజాగా అక్షయ తృతీయకు సైతం విక్రయాలు లేక బులియెన్ మార్కెట్ వెలవెలపోయింది. కరోనా దెబ్బకు బంగారం కొనాలనే సెంటిమెంట్ కూడా మంట గలిసింది. బతికుంటే చాలు.. బంగారం సంగతి తర్వాత అనుకున్నారేమో.. అక్షయ తృతీయకు అమ్మకాలు అసలే మాత్రం జరగలేదు. గడిచిన ఏడాదిలానే, ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ పర్వదినం లాక్‌డౌన్‌లో కలిసిపోయింది. రూల్స్ మేరకు ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే జ్యువెల్లరీ షాపులు తెరిచినా.. కనీసం బోణీ కూడా కాని షాపులు ఎన్నో. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలవుతుండడంతో ఆభరణాల వ్యాపారం బాగా తగ్గింది.
అక్షయ తృతీయకు డిజిటల్, ఆన్‌లైన్‌ల ద్వారా వ్యాపారం చేద్దామన్నా కుదరలేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ చాలా తక్కువ. ఎంతగా ట్రై చేసినా.. వీడియో కాలింగ్ ద్వారా వర్చువల్ షాపింగ్ సదుపాయాలు, వర్చువల్ ట్రయల్ రూములు, హోమ్ డెలివరీ, ఇ-క్యాటలాగ్స్ అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. ముందస్తు బుకింగ్‌లపై రాయితీలు, వజ్రాభరణాల తయారీ ఛార్జీల మినహాయింపు లాంటి తాయిలాలూ, ప్రయత్నాలు చేసినా ఈ ఏడాది అమ్మకాలు ఏమాత్రం పుంజుకోలేదు.
బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే 5% తగ్గి.. తులం బంగారం రూ.47,500 స్థాయికి చేరినా పాత కస్టమర్లు మాత్రమే అక్షయ తృతీయపై దృష్టి సారించారు. కొందరు రూ.3,000-4,000 ధరలో వచ్చే బంగారు నాణేలు కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్, ముంబయి, ఢిల్లీ, పుణె, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జువెల్లరీ స్టోర్స్ మూతపడ్డాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం ఈనెల 17న ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే మే 21 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పసిడి బాండ్లకు ఇష్యూ ధర గ్రాముకు రూ.4,777 గా నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.