భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
posted on Sep 3, 2024 @ 10:56AM
గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదవరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారుల హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసింది. సహాయక శిబిరాల వద్ద నిత్యావసర వస్తువులను నిల్వ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ సాయంత్రానికి 47 అడుగులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఖమ్మం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సమాయత్తమైంది. మరో వైపు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం ఆందోళన చెందుతున్నారు.