గోదావరి ఉగ్రం! భద్రాచలం... జరభద్రం!
posted on Jul 23, 2024 @ 2:07PM
భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదవరికి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరింది. 13.23 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు గోదావరి వరదతో కోనసీమ పరిధిలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉద్యాన పంటలు, కాజ్‌వేలు మునిగిపోయాయి. పి.గన్నవరం, అయినవిల్లి మండలాలకు చెందిన లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, తాలిపేరు తదితర ఉపనదుల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులను దాటింది. సాయంత్రం 6 గంటలకు 49.10 అడుగులకు చేరుకుంది.
మంగళవారం (జులై 23) ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులకు చేరువైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 11,82,547 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ఉరకలెత్తుతోంది. ఎగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద నిలకడగా కొనసాగుతోంది.