రూ.1,500 కోట్లు ఆదా చేశామంటున్నారు.. మరి ఈ రహస్య జీవోలేంటి?
posted on Jun 13, 2020 @ 3:44PM
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి సంబంధించి జీవో కూడా విడుదలైంది. కానీ జీవోను ఓపెన్ చేస్తే మాత్రం అందులో వివరాలు వెల్లడించకుండా కాన్ఫిడెన్షియల్ అని చూపిస్తుంది. దీంతో, ఒప్పందం జీవోను ప్రభుత్వం ఎందుకు రహస్యంగా పెట్టిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. కానీ, అప్పుడు అందులో స్కాం జరిగిందని, ఇప్పుడు తాము వందల కోట్లు ఆదా చేశామని జగన్ సర్కార్ చెబుతోంది. సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం అయితే లెక్కలతో సహా చెబుతున్నారు. "భోగాపురం విమానాశ్రయం నిర్మించేందుకు జీఎంఆర్ తో గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2,700 ఎకరాల భూమిని కేటాయించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై జీఎంఆర్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. విమానాశ్రయం నిర్మాణాన్ని 2,200 ఎకరాలను పరిమితం చేసింది. దాంతో ప్రభుత్వానికి 500 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి విలువ రూ.1,500 కోట్లు. తద్వారా ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఆదా చేసింది." అని చెప్పుకొచ్చారు. మరి అంత ఆదా చేసినప్పుడు రహస్య జీవో ఎందుకిచ్చారు? అసలు ప్రజలకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో భోగాపురం విమానాశ్రయంలో పెద్ద స్కామ్ ఉందని, జీఎంఆర్ కు ఇచ్చేందుకే చంద్రబాబు సర్కారు కుట్ర చేసిందని అజేయకల్లం ఆరోపించారు. టిక్కెట్ల ధరలో వాటా అనటం వల్ల సర్కారుకు నష్టం అని ఆర్ధిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ సంస్థకు అడ్డగోలుగా ఎలా రాయితీలు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జగన్ మొదలుకొని అనేకమంది వైసీపీ నేతలు ఈ ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. మరి అప్పుడు జీఎంఆర్ ని విమర్శించిన జగన్.. ఇప్పుడదే జీఎంఆర్ తో ఒప్పందం ఎలా చేసుకున్నారు?. అసలు రూ.1,500 కోట్లు కోట్లు చేస్తే ఇలా రహస్య జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న జగన్ సర్కార్.. ఇలా రహస్య జీవోలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.