కాశ్మీర్ వద్దు కోహ్లీని ఇచ్చేయండి చాలు.. సామాజిక మాద్యమంలో వైరల్ అవుతున్న పోస్టు
posted on Oct 26, 2022 @ 11:11AM
భాతర్, పాకిస్థాన్ ల మధ్య వైరుద్ధ్యాలకూ, నిత్య ఘర్షణలకూ, దౌత్య సంబంధాలే కాదు, క్రీడా సంబంధాలూ తెగిపోవడానికి ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్. ఇరు దేశాల మధ్యా దేశ విభజన నాటి నుంచీ జమ్మూ కాశ్మీర్ అంశం ఒక్కటే పెద్ద సమస్యగా ఉన్న సంగతి విదితమే.
ఇరు దేశాల మధ్యా కాశ్మీర్ కోసమే ఇరు దేశాల మధ్యా కార్గిల్ సహా మూడు యుద్ధాలు జరిగాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో నిత్యం కాల్పుల ఉల్లంఘనకు పాకిస్థాన్ పాల్పడుతోందంటే అందుకు కారణం కాశ్మీరే. నిత్యం కాశ్మీర్ కోసం పోరాడే పాకిస్థాన్ నుంచి ఇప్పుడు కొందరు మాకు కాశ్మీర్ అవసరం లేదంటున్నారు. కాశ్మీర్ కు బదులుగా విరాట్ కోహ్లీని ఇచ్చేయండి చాలు అంటూ ప్రతిపాదిస్తున్నారు.
విషయమేమిటో అర్ధమైపోయింది కదా.. కింగ్ కోహ్లీకి భారత్ లోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్ లోనూ కోహ్లీని అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువే. టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం(అక్టోబర్23) జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వీరవిహారం క్రికెట్ అభిమానులందరినీ ఎంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో 160 పరుగుల లక్ష్య చేధనలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. 31 పరుగులకే నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి ఓటమి అంచున నిలిచిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో ఆదుకుని గెలిపించాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి రాగా.. 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుత సిక్స్ బాది లక్ష్యాన్ని కరిగించాడు. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లీ.. ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో దేశంలోనే కాదు ప్రపంచ మంతటా క్రికెట్ అభిమానులు కోహ్లీకి నిరాజనాలు పట్టారు.
పాకిస్థాన్ లో సైతం కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాకిస్థాన్ లో కోహ్లీపై అభిమానం వారి దేశ భక్తిని సైతం మించి పోయింది. అందుకే కోహ్లీ ఉంటే చాలు.. కాశ్మీర్ ఎందుకు మాకు అంటున్నారు. అంది ఎంత వరకూ వెళ్లిందంటే.. కాశ్మీర్ మాకు వద్దు.. విరాట్ కోహ్లీని ఇచ్చేయండి అంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయిన ఓ బ్యానర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ బ్యానర్ ఇప్పటిది కాదు.. కానీ టైమ్లీగా కోహ్లీ ఫ్యాన్స్ నాటి బ్యానర్ ను ఇప్పుడు మరో సారి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే కాదు.. ఇది జరిగే పని కాదు.. విరాట్ ను ఇవ్వడం జరిగే పని కాదంటూ కౌంటర్ కూడా సామాజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది.