అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే జరిమానా...!!
posted on Feb 21, 2016 @ 8:49PM
టెక్నాలజీ పెరిగింది. చదువుకున్నా, చదువుకోకపోయినా, అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ప్రతీదీ స్మార్ట్ ఫోన్ సాయంతో చేతిలో ఉంటుంది. కానీ ఆ ఊళ్లో మాత్రం, పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే చాలు జరిమానా విధిస్తారు. ఆ సమాచారాన్ని అందించిన వాళ్లకు బహుమతి ఇస్తారు.
గుజరాత్ లోని సూరజ్ అనే ఊళ్లో ఈ వింత ఆచారాన్ని మొదలెట్టారు. ఎప్పటినుంచో కట్టుబాట్ల మధ్య ఉన్న ఆ ఊరు మొబైల్ ఫోన్లు వచ్చాక స్పీడ్ అయిపోయింది. ప్రేమ దోమ అంటూ కుర్రకారు మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని భావించిన ఊరిపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పెళ్లి కాని అమ్మాయిలకు మాత్రమే ఈ కండిషన్. ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ దొరికిపోతే, రెండు వేల వరకూ జరిమానా పడుతుంది.
ఇదేం వింత ఆచారంరా బాబూ అనుకుంటున్నారా..? అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని, కుర్రాళ్లు ఫోన్లలో మాట్లాడే బుట్టలో వేసుకుంటున్నారు. అలా మాట్లాడే వాళ్లలో పెళ్లి చేసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటున్నారు. అందుకే ఆడపిల్లలు మోసపోకూడదనే ఇలా చేశాం అని గ్రామపెద్దలు సమాధానం చెబుతున్నారు. ఫోన్ అనేది ఉపయోగం కంటే వ్యసనంగా మారిపోయిందని, త్వరలోనే పిల్లలకు కూడా ఈ రూల్ పెట్టబోతున్నామని చెబుతున్నారు. నరేంద్రమోడీ సొంత ఊరికి, ఈ ఊరు చాలా దగ్గర్లోనే ఉండటం విశేషం.