Read more!

ఆత్మ ఉందని శాస్త్రవేత్తలు కనుక్కొన్నారా?

 

మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అన్న విషయం మీదే మతాలన్నీ ఆధారపడి ఉన్నాయంటారు. అందుకనే ఈ విషయం మీద బోల్డు చర్చలు, వాదనలు సాగుతుంటాయి. కొంతమంది మరో అడుగు ముందుకు వేసి ఫలానా దేశంలో ఆత్మ బరువు ఎంత ఉందో లెక్కకట్టారనీ, ఫలానా చోట ఆత్మని ఫొటో తీశారనీ చెబుతూ ఉంటారు. ఇలాగే రెండేళ్ల క్రితం కొందరు జర్మనీ శాస్త్రవేత్తలు ఆత్మ ఉందని నిరూపించారన్న వార్త గుప్పుమంది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ వార్తే కనిపించింది. ఇండియాటుడే లాంటి పత్రికలు సైతం ఈ వార్తని ప్రచురించాయి. ఈ వార్త ప్రకారం జర్మనీలోని టెక్నిసే విశ్వవిద్యాలయంలో Dr Berthold Ackermann అనే శాస్త్రవేత్త పనిచేస్తున్నారు.

 

ఈయన ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు శరీరం వేరు, ఆత్మ వేరు అని కనుగొనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయోగం కోసం 900 మందికి పైగా కార్యకర్తలను ఎన్నుకొన్నారట. వీరిలో ఆస్తికులు, నాస్తికులు, హిందువులు, ముస్లింలు.. అన్న బేధాలు లేకుండా అన్నిరకాల వారూ ఉన్నారు. పరిశోధన కోసం ఎన్నుకొన్న అభ్యర్థులందరినీ తాత్కాలిక కోమాకి గురిచేశారు. ఒక ఇరవై నిమిషాల తర్వాత వారిలో తిరిగి కదలికలను తీసుకువచ్చారు. మరణానికి దగ్గరగా ఉన్న ఆ పరిస్థితిలో వారు ఎలాంటి అనుభూతికి లోనయ్యారో తెలియచేయమని చెప్పారు. ఆశ్చర్యంగా అభ్యర్థులంతా కూడా తాము ఒకేరకమైన అనుభూతులు పొందామని చెప్పారు.

 

తాము శరీరం నుంచి వేరైనట్లుగా తోచడం, ఆకాశంలో తేలిపోతూ ఉండటం, అంతులేని ప్రశాంతత, అప్పటిదాకా ఉన్న భయాందోళనలన్నీ చెరిగిపోవడం, గాలిలో కరిగిపోతున్నట్లుగా అనిపించడం... లాంటి అనుభూతులన్నీ అభ్యర్థులకి కలిగాయట. తాము ఒక కాంతిపుంజం ముందు నిలబడిన భావన కూడా కలిగిందట! మతాలకు అతీతంగా, నాస్తికులకు సైతం ఇలాంటి అనుభవాలు కలిగాయట!

 

ఈ వార్త World News Daily Report అనే వెబ్సైటులో కనిపించగానే సంచలనంగా మారిపోయింది. వెంటనే ప్రపంచంలోని జాతీయ పత్రికలన్నీ ఈ వార్తని ప్రచురించేశాయి. ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదన్నది చాలామంది వాదన. కానీ వార్తలో పేర్కొన్న ‘ఆత్మానుభూతులు’ మనం ఈ మధ్యకాలంలో చదువుతున్న ఆధ్యాత్మిక పుస్తకాలను దగ్గరగా ఉండటంతో... ఈ వార్త నిజమే అని ఒప్పుకునేవారూ ఉన్నారు. పరిశోధన జరిగిందో లేదో కానీ, జరిగితే ఇదే బయటపడుతుందని ఆస్తికుల వాదన!

- నిర్జర.