జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు తెదేపా, బీజేపీలు సిద్దమేనా?
posted on Jan 2, 2016 @ 11:29AM
ఒకప్పుడు తెరాస నేతలు హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల పట్ల తీవ్ర విద్వేషభావం ప్రదర్శించేవారు. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆంధ్రా ప్రజలలో అభద్రతాభావం కలిగేవిధంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు మంత్రి కె.టి.ఆర్. ఆ ఆంధ్రా ప్రజల ఓట్లతోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకొంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధానం చూసి చాలా మెచ్చుకొంటున్నారని కె.టి.ఆర్.అన్నారు.
తెరాస అధికారంలో ఉండటం వలన సహజంగానే కలిసివస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తోంది. ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. అలాగే మైనార్టీలను ఆకట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 60 రెసిడెన్షియల్ స్కూళ్ళని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి అనేక కార్యక్రమాలను కూడా ప్రకటించింది. ఒకప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకాడిన తెరాస ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని పూర్తి ఆత్మవిశ్వాసం ప్రకటిస్తుండటం గమనించవచ్చును.
తెరాస నేతలు ఇప్పుడు జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ప్రసన్నం చేసుకొనే పనిలోపడగా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకప్పుడు తెరాస నేతలు ప్రజలతో ఏవిధంగా అనుచితంగా వ్యవహరించారో గుర్తుకు చేసి తెరాసను దెబ్బ తీసి గెలవాలని భావిస్తున్నట్లు భావిస్తోంది. ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడంతో మంచి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో గెలిచి మేయర్ పీఠం దక్కించుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. అప్పుడే మేయర్ అభ్యర్ధి పేరును కూడా ఖరారు చేసేసామని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకి తెలిపారు. రేపు జరుగబోయే పార్టీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. డివిజన్ల వారిగా పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఈ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసం తెదేపా, బీజేపీలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. జంట నగరాలలో బలంగా ఉండటం వలన బీజేపీ చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే, ఆంధ్రా ఓటర్లు తెరాసను వ్యతిరేకించడం తధ్యం కనుక వారి ఓట్లు తమకే పడతాయని ధీమాతో తెదేపా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలలో అపనమ్మకం కనబడుతోంది. అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలలో కనిపిస్తున్న ఉత్సాహం ఆ రెండు పార్టీలలో కనబడటం లేదు. అందుకు కారణాలు అందరికీ తెలుసు. కానీ మిగిలిన అన్ని పార్టీల కంటే ఈ ఎన్నికలలో గెలవలసిన అవసరం వాటికే ఉంది లేకుంటే మున్ముందు చాలా గడ్డు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయం తెదేపా, బీజేపీలకు తెలియదని అనుకోలేము. కనుక అవి కూడా అందుకు తగిన వ్యూహాలు సిద్దం చేసుకొని, ఈ ఎన్నికలలో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఈనెల 4వ తేదీన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వబోతున్నట్లు సమాచారం.