ముందు గెజిట్ నోటిఫికేషన్.. ఆ తరువాత బిల్లుల ఆమోదం.. ఇదెక్కడి చోద్యం!
posted on Sep 13, 2022 @ 6:12PM
అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టంఅన్నట్లుగా ఉంది తెరాస ప్రభుత్వం తీరు. విలువలు, నిబంధనల ఊసే లేకుండా ఇష్టాను సారంగా సభా వ్యవహారాలను సాగించేస్తున్నదన్న విపక్షాల విమర్శలకు బలం చేకూర్చేదిగానే ప్రభుత్వం తీరు ఉంది.
ఏదైనా ఒక బిల్లు సభలో ప్రవేశపెట్టిన తరువాత దానిపై చర్చ జరుగుతుంది. సభ్యులు తమ అభ్యంతరాలను తెలియజేస్తారు. ప్రభుత్వం వాటిని పరిగణనలోనికి తీసుకుంటే మళ్లీ సవరణలు చేస్తారు. ఆ తరువాత సదరు బిల్లు పాస్ అవుతుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాతనే దానిని గెజిట్ లో ప్రచురిస్తారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రొసీజర్ ఇది కాగా, కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విధానాలన్నిటికీ తిలోదకాలిచ్చేసింది.
అధికారం చేతిలో ఉంది, సభలో ప్రశ్నించే విపక్షాలకు సంఖ్యా బలం లేదు. ఏ విషయాన్నైనా బుల్ డోజ్ చేసేందుకు అవసరమైన మంద బలం ఉందన్న ధీమాతో తెరాస సర్కార్ అసెంబ్లీ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తోందనడానికి నిదర్శనమే మంగళవారం సభలో ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను సోమవారం తేదీతో ముద్రించి దానినే సభ్యులకు మీడియాకు సర్క్యులేట్ చేయడం. అలాగే సభలో మంగళవారం (సెప్టెంబర్ 13న) ప్రవేశపెట్టిన బిల్లులను 12నే ప్రవేశపెట్టినట్లుగా పేర్కొంటూ అదే 12వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం. తెలంగాణ శాసనసభ సమావేశాలు మూడో రోజు మంగళవారం (సెప్టెంబర్ 13) ప్రభుత్వం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, కావేరి వ్యవసాయ, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్‌ఆర్, నిక్ మార్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదముద్ర వేసింది.
అలాగే కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 25 శాతం తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభ ఆమోదించింది. రేపు సభలో ఏం జరగాలో ఈ రోజే నిర్ణయించేసి, అందుకు అనుగుణంగా పేపర్లు రూపొందించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చందంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్నది.
చట్ట సభల ప్రతిష్టను మసకబార్చే విధంగా తెరాస సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట సభలలో ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రభుత్వమేదీ గతంలో లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈ తీరు అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.