గెహ్లాట్ గేమ్ ప్లాన్ సక్సెస్ ఇక పైలట్ కు నో ఛాన్స్!
posted on Oct 1, 2022 @ 7:18PM
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ యువ నాయకుడు, సచిన్ పైలట్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న ఆయన ఇక ఆ ఆశ వదులుకోవలసిందేనా? ఇక ఆయనకు ముఖ్యమంత్రి పదవి రానట్లేనా? అంటే ఆ రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ పండితులు అవుననే అంటున్నారు.
నిజానికి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి పైలట్టే ప్రధాన కారణం. పీసీసీ అధ్యక్షుడిగా ఐదేళ్ళు పార్టీని ముందుండి నడిపించింది పైలట్. కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చింది పైలట్. కానీ, చివరకు ముఖ్యమంత్రి పదవి పైలట్ కు చిక్కినట్లే చిక్కి చేజారి పోయింది. అధినాయకత్వం ఆయన్ని కాదని, అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిని చేసింది. సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం చేసింది ఇక అప్పటి నుంచి పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆడుతున్న రాజకీయ క్రీడలో పావుగా మిగిలి పోయారు. ఒక దశలో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అద్గిష్టానానికి తమ అసంతృప్తిని తెలియ చేసినా, రాహుల్, ప్రియాంక జోక్యం చేసుకుని బుజ్జగించడంతో సర్దుకున్నారు. అధిష్టానం జోక్యంతో పైలట్ వర్గానికి చెందిన కొద్ది మందికి మంత్రి పదవులు అయితే దక్కాయి, కానీ, ముఖ్యమంత్రి కావాలనే పైలట్ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది.
అయితే, అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రావడం, పార్టీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను, అభ్యర్ధిగా నిర్ణయించడంతో, పైలట్ లో మళ్ళీ ఆశలు చిగురించాయి.అయితే అంతలోనే మళ్ళీ నీరుగారి పోయాయి. ముఖ్యమంత్రి కుర్చీ ఎట్టి పరిస్థితిలో పైలట్ కు దక్కకుండా చేసేందుకు అశోక గెహ్లాట్ ప్లే చేసిన ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా ట్రిక్ ‘ఇటు పైలట్’ను అటు అధిష్టానాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.
నిజమే కావచ్చును, అశోక్ గెహ్లాట్ అనుకున్నది సాధించిన తర్వాత సోనియాకు క్షమాపణలు చెప్పి, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలో లేదో నిర్ణయించే అధికారం ఆమెకే వదిలేశారు. అయితే once bitten twice shy అన్నట్లుగా ఒక సారి గెహ్లాట్ ‘విధేయత’ రుచి ఏమిటో చూసిన సోనియా గాంధీ, ఇప్పటికిప్పుడు మళ్ళీ, గెహ్లాట్ మాట నమ్మి, పైలట్ ను ముఖ్యమంత్రిని చేసే సాహసం చేస్తారా అంటే చేయరనే పరిశీలకులు అంటున్నారు. నిజానికి గేహ్లోట్, ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల ద్వారా అధిష్టానానికి, చాలా స్పష్టంగా తనతో గేమ్స్ వద్దని చెప్పకనే చెప్పారు.
అయితే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రెండు రోజుల్లోనే సోమియా గాంధీ రాజస్థాన్ పరిణామాలపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పి రెండు కాదు మూడు రోజులు అయింది కానీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నిజానికి, ఇప్పటి కిప్పుడు సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి గెహ్లాట్ ను తొలిగించి పైలట్ కు పట్టం కట్టే పరిస్థతి కనిపించడం లేదు. మరో వంక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చక పోవచ్చని అంటున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు పైలట్ కు కుర్చీ యోగం లేనట్లే అంటున్నారు. ఎన్నికల తర్వాత, అంటారా అప్పుడు రాజెవరో రెడ్డి ఎవరో ... అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో .. చెప్పలేమని అంటున్నారు.