ఇదేం చెత్త పన్ను కేసీఆర్?
posted on Mar 23, 2021 @ 3:22PM
అప్పట్లో తుగ్లక్ హయాంలో జుట్టు పన్ను ఉండేది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. అవును, ఇదేమీ ఆరోపణ కాదు. పచ్చి నిజం. వరంగల్ కార్పొరేషన్‌లో జరుగుతోంది ఈ తతంగం. ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు చెత్త రవాణా పన్ను కూడా జారీ చేస్తున్నారు. ప్లింత్ ఏరియా ఆధారంగా పన్ను విధిస్తున్నారు. ఎంత పెద్ద స్థలం ఉంటే.. అంత ఎక్కువ చెత్త పన్ను విధిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా.. కార్పొరేషన్ తీరుపై విమర్శలు వస్తున్నా.. అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.
చెత్త తరలింపునకు ఇప్పటి వరరకూ ఒక్కో ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు వసూలు చేసేవారు. ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్న వరంగల్ కార్పొరేషన్ కొత్తగా చెత్త రవాణా పన్ను తీసుకొచ్చారు. ఆస్తిపన్నుతో పాటు చెత్త తరలింపు పన్ను వసూలు చేసేందుకు 4 నెలల క్రితం గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. బిల్డింగ్ ప్లింత్ ఏరియా ఆధారంగా చెత్త పన్ను మదింపు చేస్తున్నారు. పన్ను నోటీసుల్లో కొత్తగా గార్బేజ్ ట్రాన్స్‌పోర్టేషన్ (జీటీ) పన్ను విధించారు. భవనం విస్తీర్ణాన్ని బట్టి చెత్త పన్ను 100 నుంచి 150 వరకూ ఉంటోంది. గతంలో 60 రూపాయలతో అయిపోయేది.. ఇప్పుడు ఏకంగా డబుల్ అయిందని నగరవాసులు మండిపడుతున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు- మార్చి నెల ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులో చెత్త పన్ను కూడా కలిపి ఇచ్చారు. అయితే.. 42 విలీన గ్రామాలు, గ్రేటర్ పరిధిలోని 183 మురికివాడలకు చెత్త పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. నివాసిత గృహాలు, వ్యాపార, వాణిజ్య భవనాలకు ప్లింత్ ఏరియా ఆధారంగా పన్ను మదింపు చేయడం ఇబ్బందిగా మారనుంది. రెసిడెన్షియల్ కేటగిరీలో 1200-1500 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉంటే చెత్త తరలింపు పన్ను రూ.120-150 అవుతోంది. వాణిజ్య భవనమైతే 1000-2000 చదరపు అడుగులుంటే నెలకు రూ.120-240 వరకు వస్తోంది. చెత్త పన్ను చెత్త చెత్తగా ఉందంటూ వరంగల్ నగర పౌరులు కార్పొరేషన్ తీరుపై కస్సుమంటున్నారు.