చెత్త వాహనాల్లో వినాయక విగ్రహాల తరలింపు?
posted on Sep 7, 2021 @ 12:54PM
ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడంపై రచ్చ కొనసాగుతుండగానే మరో వివాదం నెలకొంది. అధికారుల ఓవరాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినాయక విగ్రహాలను చెత్త తరలించే వాహనంలో తరలించడం తీవ్ర దుమారం రేపుతోంది. అధికారుల తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి,.
విగ్రహాల తరలింపు వివాదం కావడం, జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కమిషనర్ స్పందించారు. గుంటూరులో చెత్తను తరలించే వాహనాల్లో వినాయక విగ్రహాలను తరలించిన పారిశుద్ధ్య సిబ్బందిపై కమిషనర్ అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అత్యుత్సాహంతో వినాయక విగ్రహాలను పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో వేసి తీసుకెళ్లడంపై ఆమె మండిపడ్డారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
గుంటూరు నగరంలోని జ్వరాల ఆసుపత్రి సమీపంలో రహదారి వెంబడి కొందరు వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. అనుమతి లేదంటూ గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో తీసుకెళ్లారు. గణపతి విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో ఎక్కించి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే వేడుకలపై ఆంక్షలు పెట్టడంపై జనాలు మండిపోతున్నారు. ఇప్పుడు విగ్రహాలను కార్పొరేషన్ చెత్త తరలింపు వాహనంతో తరలించడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరు వల్లే అధికారులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు.