మన సర్కారీ దవాఖానాల రోగం… మందులకి తగ్గేది కాదు!
posted on May 31, 2017 @ 11:03AM
శారీరిక ఆరోగ్యం బాగాలేక గవర్నమెంట్ ఆసుపత్రికి వెళితే మానసిక వేదనకి గురి చేసి నాలుగు రోజులు ముందుగానే చంపేస్తారు! ఇదీ మన దవాఖానాల్లో పరిస్థితి! ఒకవైపు ప్రైవేటు కార్పోరేట్ హాస్పిటల్స్ ఇంటికే వచ్చి వైద్యం చేస్తామంటూ అతి సేవలు అందిస్తోంటే సర్కార్ ఆసుపత్రులు మాత్రం అత్యంత దయనీయంగా మిగిలిపోతున్నాయి. అయినా కూడా డబ్బులు లేని, బిల్లులు కట్టలేని అభాగ్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ ముఖం చూడకుండా గాంధీ, ఉస్మానియాల వంటి వాటికే రావాల్సి వస్తుంటుంది. అలా వచ్చిన కూలీలు, కార్మికులు, పల్లెటూరి జనం, పట్టణ పేదలు… వీరందరి నరకం వర్ణనాతీతం!
గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం సరిగ్గా వుండదనేది చాలా పెద్ద చర్చకు దారి తీసే అంశం. అసలు అక్కడికి వెళ్లిన చిక్కి శల్యమైన నిరు పేద రోగులకి వీల్ చెయిర్లు, స్ట్రెచర్లు వుంటాయా? తగినన్ని మంచాలుంటాయా? సెలైన్ ఎక్కించే స్టాండ్లు వుంటాయా? ఏవీ వుండవు! ఎలాగోలా దిక్కూమొక్కూ లేని భారతీయులు సర్కార్ దవాఖానాలో వైద్యం పొందగలిగితే… అక్కడి వారు ఎక్కించే సెలైన్లో పురుగులుండవని గ్యారెంటీ లేదు! ఇది మన దేశ, రాష్ట్ర గవర్నమెంట్ వైద్య రంగం పరిస్థితి! ఇలాంటి నరక కూపం లాంటి ఆసుపత్రులు ఆఫ్రికా దేశాల్లో కూడా వుండవనుకుంటా! కాని, ప్రపంచంలోనే చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందుతోన్న మన దేశంలో మాత్రం వుంటాయి! బంగారు తెలంగాణ మెరిసిపోతన్నా మన రాష్ట్రంలోనూ వుంటాయి!
ఆ మధ్య సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి… నడిచి లోపలికి వెళ్లలేని ఒక రోగి వస్తే కనీసం వీల్ చెయిర్ ఇవ్వలేదు అక్కడి సిబ్బంది. అది పెద్ద దుమారంగా మారింది మీడియాలో. తరువాత తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖా మంత్రి స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి పరిస్థితులు చూసొచ్చారు. అయినా మార్పు రాలేదు. సరి కదా ఇప్పుడు తాజాగా… ఒక ఎమ్మెల్యే భార్య తన బంధువుని గాంధీ అసుపత్రికి తీసుకొస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు! దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య తానే స్వయంగా వీల్ చెయిర్ తెచ్చుకుని బంధువైన రోగిని అందులో కూర్చోబెట్టుకుని తోసుకెళ్లారు! ఇంతా జరిగినా ప్రభుత్వాసుపత్రి పెద్దలు ఒక్కరూ స్పందించలేదు!
ఎమ్మేల్యే భార్యకి ఎదురైన దుస్థితి చూశాక పూట గడవని పేదలు మన ప్రభుత్వాసుపత్రుల్లో ఎంత గౌరవం, ప్రమా పొందుతున్నారో చక్కగా అర్థం చేసుకోవచ్చు! పరిస్థితి ఇలా వుంటుంది కాబట్టే , దాదాపు ఎప్పుడూ మన ఎమ్యేలేలు, ఎంపీలు, వారి బంధువులు సర్కార్ నడుపుతారు కానీ … సర్కారీ దవాఖానాకు రారు! తమ పిల్లల్ని సర్కారీ బడుల్లో చదివించరు! ఇక విద్యా, వైద్యం కోట్లాది మంది పేదలకి అందని దేశం … అది ఏదైనా, ఎంతటిదైనా ఎలా బాగుపడుతుంది? సర్కార్ నడిపే షావుకార్లే ఆలోచించాలి!