ఏపీకి నిధుల వరద!
posted on Aug 20, 2024 @ 9:43AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, సమర్ధత కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల వరద పారుతోంది. తాజాగా పలు శాఖలలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, మూల ధన వ్యయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి విడతగా కేంద్రం 2200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులతో పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించి ప్రాజెక్టులను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే అమరావతి కోసం కేంద్రం హామీ ఇచ్చిన విధంగా 15వేల కోట్ల రూపాయల ఆర్థిక సహకారం విషయంలో వేగం పెరిగింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిథులు మంగళవారం (ఆగస్టు 20) నుంచి వారం రోజుల అమరాతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. ఆర్థిక సహాయం, పనుల వేగవంతం తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతిపై కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారు.
మరో వైపు పోలవరం ప్రాజెక్టు పనుల విషయంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆయన ఇటీవలి హస్తిన పర్యటనలో పోలవరం సత్వర పూర్తికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాల గురించి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులకు వివరించారు. మరో వైపు శ్రీసిటీని సందర్శించి పలు ప్రాజెక్టులను ప్రారంభించి, మరిన్నిటికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ఆ పరుగుల వేగాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు తన అనుభవంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో సంక్షేమానికి కూడా లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.