నాగబాబు.. అల్లు అర్జున్ వివాదానికి తెరపడినట్లేనా?
posted on May 18, 2024 @ 2:55PM
రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు. ఇంతకే నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే చేసిందని అంతా భావించడానికి కారణమేమిటంటే..
ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించారు. ఇది రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది. ఎంత మిత్రుడైనా నంద్యాల వెళ్లి మరీ మద్దతు తెలపడానికి ఇదా సమయం అంటూ విస్తృత చర్చ జరిగింది. సరే దానికి అల్లు అర్జున్ పార్టీలతో సంబంధం లేదు.. ఫ్రెండ్ అయితే చాలు ఎంత దూరం వెళ్లైనా మద్దతు తెలుపుతా అని చెప్పాడనుకోండి అది వేరే సంగతి. అంతకు ముందు పవన్ కల్యాణ్ కు మద్దతుగా కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ తీరు మెగా ఫ్యామిలీతో ఆయనకు విభేదాలున్నాయన్న భావన కలిగించింది.
సరిగ్గా ఈ నేపథ్యంలో నాగబాబు మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు మావాడైనా పరాయివాడేనంటూ ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన ట్వీటేనంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. నాగబాబు టార్గెట్ గా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు నాగబాబు తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తాజాగా ఆయన మళ్లీ తన ఎక్స్ ఖాతాను యాక్టివేట్ చేసి అల్లు అభిమానుల మనోభావాలను గాయపరిచిన ఆ ట్వీట్ ను తొలగించేశానని పేర్కొన్నారు. సొంత వాళ్లయినా పరాయివాళ్లే అన్న ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు అంతటి ఆగ్రహం కలిగిస్తుందని నాగబాబు ఊహించి ఉండరు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఆయన ఆ ట్వీట్ ను తొలగించాను అని పేర్కొన్నారు. మొత్తం మీద నాగబాబు వెనక్కు తగ్గడంతో ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.