మూడు రాజధానుల రాజకీయం ఎత్తిపోయిందా? ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఫ్రస్టేషన్ కు అదే కారణమా?
posted on Oct 7, 2022 @ 12:07PM
ప్రజాభీష్టాన్ని కాదని ముందుకు వెళితే ఏం జరుగుతుందో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తే అర్ధమౌతుంది. గత ఎన్నికలకు ముందు అమరావతే ఏపీ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన వైసీసీ ఇప్పుడు మూడు రాజధానులంటూ మాట మార్చడాన్ని రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తోంది. అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని నినదిస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు అన్ని ప్రాంతాల నుంచీ వెల్లువెత్తుతున్న మద్దతుతో వైసీపీ అధినేత మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా యాత్రను అడ్డుకోండంటూ ఆయన మంత్రులు, పార్టీ శ్రేణులకు ఆదేశాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో సీనియర్ మంత్రులు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు.
మూడు రాజధానుల రాజకీయం ఎత్తిపోయిందా? రైతుల మహాపాదయాత్ర వైసీపీ నేతల్లో గుబులు రేపుతోందా? రైతుల మహాపాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ జగన్ , ఆయన కేబినెట్ సహచరులను గాభరా పెడుతోందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. రైతుల మహాపాదయాత్ర సాగుతున్న కొద్దీ.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనం గళమెత్తుతున్నారు. గతంలో కంటే బలంగా వారు తమ వాణిని వినిపిస్తున్నారు.
యాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు వాడవాడలా మహాపాదయాత్రకు లభిస్తున్న స్పందన వైసీపీ వర్గాల్లో ఫ్రస్ట్రేషన్ కు కారణమౌతోంది. దాంతో వైసీపీలో ఎంతో కొంత అనుభవం ఉన్న మంత్రులు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మంత్రులు బొత్స, అమర్నాథ్ లు అయితే కొడాలి నాని భాషను అరువు తెచ్చుకుని మరీ మాట్లాడుతున్నారు. వారి ఈ వైఖరే మూడు రాజధానుల పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఎత్తి చూపుతోంది. రాష్ట్రం మొత్తం అమరావతే ఏకైక రాజధాని అని ముక్తకంఠంతో నినదిస్తున్నదన్న విషయం రైతుల మహాపాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రస్ఫుటమౌతోంది.
దీంతో దిక్కు తోచని స్థితిలో పడ్డ వైసీపీ అధీష్టానం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దాని పర్యవశానమే బొత్స రైతులను దోపిడీ దారులు అనడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల మహాపాదయాత్రను బొత్స దోపిడీ దారుల మహాయాత్రగా అభివర్ణించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ.. దానిని ఎలాగైనా అడ్డుకోవాలన్న తపన, తాపత్రేయం వైసీపీలో ఎక్కువ అవుతోంది.
రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి రైతుల మహాపాద్రయాత్రను నిలిపివేయాలన్న తహతహ కనిపిస్తోంది. అందుకే విశాఖ వస్తే రైతుల కాళ్లు విరగ్గొడతాం, తరిమి కొడతాం అంటూ ప్రేలాపనలకు దిగడానికి కూడా వైసీపీ మంత్రులు, నేతలు వెనుకాడటం లేదు. మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. మూడు రాజధానులంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ ప్రకటించినప్పుడు కొద్దొ గొప్పో ఉత్తరాంధ్రలో సానుకూలత కనిపించింది. కానీ ఇప్పుడు ఆ సానుకూలత అంతా ఆవిరైపోయిందని అంటున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో నేరాలు పెరిగిపోవడం, భూ కబ్జాలు, దౌర్జన్యాలూ పెచ్చరిల్లడంతో విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్న పరిస్థితి ప్రస్ఫులంగా కనిపిస్తోంది.
అందుకే వైసీపీ నుంచి రెచ్చగొట్టే విధంగా ఎన్ని ప్రకటనలు వచ్చినా ఎవరూ స్పందించడం లేదంటున్నారు. ఇక వైసీపీ నేతలు మూడు రాజధానులపై చర్చ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ప్రహసనాలుగా మారిపోతున్నాయి. ఇక వైసీపీలోకి కింది స్థాయి క్యాడర్ కూడా మూడు రాజధానుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అక్కడక్కడ అమరావతి రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేయడం వినా మూడు రాజధానులకు మద్దతుగా వారి నుంచి ఎటువంటి ప్రయత్నం, కార్యక్రమాలు ఉండటం లేదు. హై కమాండ్ హుంకరిస్తేనే ఇక తప్పదన్నట్లు స్థానిక రైతులు అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మహాయాత్రలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు అరకొర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరువాత కామ్ అయిపోతున్నారు.
ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో అమరావతి రైతులు అందరి మద్దతుతో ముందుకు సాగుతున్నారు. అమరావతి రైతులకు ఈ స్థాయి మద్దతు వస్తుందని వైసీపీ నేతలు మహాపాదయాత్రకు ముందు ఊహించలేదు. రైతులకు టీడీపీ, జనసేన సహా అన్ని పార్టీలు ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. అయితే ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికి… ఇప్పుడు మడమ తిప్పిన వైసీపీ వ్యతిరేకతను జనం ఇసుమంతైనా లెక్క చేయని పరిస్థితే రాష్ట్రమంతటా కనిపిస్తోంది. వైసీపీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకతకు దడిసే మహాపాదయాత్ర మార్గంలో వైసీపీ శ్రేణులు అడ్డకోవడానికి ప్రయత్నించే సాహసం చేయడం లేదు. వైసీపీ అధిష్ఠానం మెప్పు కోసం ఏదో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చేసేమన్నట్లుగా చేసి మమ అనిపిస్తున్నారు.