బే ఆఫ్ బెంగాల్ లో భూగోళ చీలిక.. ఉత్తరాంధ్రపై ప్రభావం
posted on Jul 20, 2020 @ 1:30PM
బంగాళ ఖాతం సముద్రగర్భంలో దాగిన భూమి పొర పగులు ఉత్తరాంధ్ర భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతానికి ఇరువైపుల భూమి పొరలపై వత్తిడి పెరిగినప్పుడు ఈ చీలికరేఖలో వచ్చే చిన్న కదలిక కూడా పెను ప్రమాదానికి కారణం కానుందని పరిశోధనల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.
వైజాగ్ తీరప్రాంతం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో దాదాపు మూడువందల కిలోమీటర్ల పొడవున ఉన్న భారీ చీలికను పరిశోధకుల బృందం గుర్తించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఆయిల్,నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఒహెచ్) పరిశోధకుల బృందం చేసిన పరిశోధన ఫలితాలను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ లో ప్రచురించారు.
ఉత్తరాంధ్రలోని విశాఖ సముద్ర తీరప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవైన పగులు రేఖ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రేఖ దక్షిణాన ప్రాణహిత-గోదావరి, ఉత్తరాన నాగవాలి-వంషాధర జోన్ మధ్య తూర్పు వైపున బస్తర్ క్రాటన్ సరిహద్దుగా ఉంది. ఈ ఫ్రాక్చర్ లైన్ కారణంగా సునామీ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరిత్యాలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకుల అధ్యయనంలో స్పష్టమైంది.
దాదాపు కోటి అరవై లక్షల సంవత్సరాల క్రితం ఈ పగులు ప్రారంభమైందని, 68లక్షల సంవత్సరాల నుంచి మూడు లక్షల సంవత్సరాల క్రితం వరకు కదలికలు ఉండేవన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కదలికలు లేకపోయినా.. భవిష్యత్ లో ప్రకృతివైపరిత్యాలకు ఈ ఫ్రాక్చర్ లైన్ కారణం కావచ్చు అని పరిశోధనల్లో స్పష్టమైంది.
ఈ ఫ్రాక్చర్ ఉన్న ప్రాంతానికి ఇరువైపుల భౌగోళికంగా ఒత్తిడి పెరిగితే సునామీ, భూకంపంలాంటి భౌగోళిక ప్రమాదాలు భారీస్థాయిలో రావచ్చని, వాటిని నివారించలేమని పరిశోధకులు పేర్కొన్నారు. విశాఖ, చుట్టు పక్కల ప్రాంతాలకు ఈ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు. హైదరాబాద్ యూనవర్సిటీ నుంచి ప్రొఫెసర్ కె.ఎస్. కృష్ణ,డాక్టర్ ఎం ఇస్మాయిల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన డాక్టర్ కె. శ్రీనివాస్, ఆయిల్,నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి డాక్టర్ డి సాహా, పరిశోధనా బృందం పరిశోధనాంశాలను విశ్లేషించింది.
ఇంత పెద్ద చీలిక ఏర్పడడానికి కారణాలు మాత్రం తెలియదు. అయితే లక్షలాది సంవత్సరాల క్రితం ఖండాంతర ఘర్షణ హిమాలయాల ఏర్పాటుకు దారితీసిందని పరిశోధకులు చెబుతారు. ఈ ఘర్షణ ప్రపంచ వాతావరణ పరిస్థితులలో పెద్ద మార్పులకు కారణమైంది. అలాంటి సమయంలోనే భూమి లోపలి పొరల్లో ఇలాంటి చీలికలు ఏర్పడి ఉండవచ్చు.