చంద్రబాబు రికార్డు.. శానా కాలం యాదుంటాది!
posted on Jun 2, 2024 @ 11:49AM
నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు. ఔను ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే.. విపక్ష నేతగా 15 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడ్డారు.
సహజంగా ఎవరికైనా వయసు ముందుకు సాగుతుంది, వృధ్యాప్యం వైపు అడుగులు వేస్తుంది, కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో వయసు వెనక్కి, యవ్వనం వైపుకు అడుగులు వేస్తోందా అనిపించేలా, వయసు పెరిగే కొద్దీ ఆయన కొత్త శక్తిని పూనుకుని మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.
అవును, 74 ఏళ్ల వయస్సులో ఆయనలో ఎక్కడ వార్ధక్యపు ఛాయలు కన్పించడంలేదు. చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో ఎక్కడా అలసట అనేదే కనిపించదు. అందుకే రాజకీయ రణక్షేతంలో అలుపెరగని యోదునిలా ముందుకు దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో వైసేపీ అరాచక పాలనను అంతమొందించేందుకు తెలుగు దేశం సారధిగా శంఖారావాన్ని పూరించారు. తెలుగుదేశం పార్టీకి ముందుండి నడిచారు. నడిపించారు. వై నాట్ 175 అంటూ విర్రవీగిన జగన్ మోహన్ రెడ్డికి ఓన్లీ 14 ఫర్ యూ అని చాటడమే కాదు.. వై నాట్ పులివెందుల అని సవాల్ విసిరారు. మే 13న పోలింగ్ జరిగిన వెంటనే వైసీపీ పరాజయాన్ని జనం ఖరారు చేసేశారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ తరువాత ఇంకా ఎవరిలోనైనా వైసీపీ విజయంపై మిగిలిన ఉన్న దింపుడు కళ్లెం ఆశలు కూడా అణగారిపోయాయి. జూన్ 4న వెలువడే ఫలితం ఎలా ఉంటుందో స్పష్టత వచ్చేసింది.
గడచిన నాలుగు దశాబ్దాల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర రాజకీయ చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ, జీవిత చరిత్ర వేరు చేయడం కుదిరే వ్యహారం కాదు. ముఖ్యంగా 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు రాజకీయ ప్రత్యర్ధులు అనేక మంది వచ్చి వెళ్ళారు. చరిత్రకే పరిమితమయ్యారు. కానీ, చంద్రబాబు నాయుడు, చరిత్ర సాక్షిగా తిరుగులేని నాయకునిగా, ఇటు ముఖ్యమంత్రిగా అటు ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో అత్యధిక కాలం సేవలు అధించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, సేవలు అందించారు. రాష్ట్ర విభజనకు ముందు తర్వాత కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడుగానూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2019 నుంచి ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సైన్ రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు.
జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలిచారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యం నింపారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా, దార్శనికుడిగా ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా నిలిచారు. కష్టంలో ఆదుకునేందుకు నేనున్నానంటూ ముందుకు నడిచే నేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా నడిపించడమే కాకుండా ప్రతిపక్షంలో ఉండి అత్యధిక కాలం పాలించిన చరిత్రలో నిలిచిపోతారు. ఎగ్జిట్ పోల్స్లాగే .. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు తెలుగుదేశం ఘన విజయాన్ని చాటితే.. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తొలి తెలుగు ముఖ్యమంత్రిగా మరో చరిత్ర సృష్టిస్తారు. ఈ రికార్డు శానా కాలం యాదుంటాది.