ఏపీ ఎన్నికల్లోనూ బర్రెలక్కలు!
posted on Mar 13, 2024 @ 10:01AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో ఆమె విజయం సాధించలేదు. అలాగని అధికార పార్టీ అభ్యర్థికి చెమట్లు పట్టించేంత పోటీ కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 15 వేల ఓట్లు వచ్చాయి. అయితే తన పోటీ ద్వారా ఆమె అధికార పార్టీ పునాదులను కదిలించింది. ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసినా, ఆమె పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులు, ఆమె లేవనెత్తిన అంశాల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిగింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ప్రభావితం చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం..
ఇప్పుడు ఏపీ ఎన్నికలలో జగన్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలకు బాధితులై న నలుగురు అసెంబ్లీ పోరులో నిలబడుతున్నారు. పరిశీలకులు ఈ నలుగురూ కూడా ఏపీ ఎన్నికలపై తమదైన ప్రభావాన్ని చూపగలరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్క పోటీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అక్కడి అధికార పార్టీపై ప్రతికూలంగా పడిందో.. ఏపీ ఎన్నికలలో ఈ నలుగురి పోటీ అలాగే జగన్ సర్కార్ పై జనంలో ప్రతికూలత మరింత పెరిగేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇంతకీ తెలంగాణలో బర్రెలక్క చూపినట్లుగా ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ప్రొది కావడానికి దోహదపడే ఆ నలుగురూ ఎవరంటారా?.. ఆ విషయం చెప్పుకునేముందు గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల ప్రచారం. ఇప్పుడు ఆ ముగ్గురూ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడనున్నారు. వీరితో పాటుగా గత ఎన్నికల ముందు హత్యకు గురైన వివేకా కుమార్తె సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు కడప పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఇక వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా జగన్ ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు.
ఈ నలుగురే తెలంగాణ ఎన్నికలలో బర్రెలక్క పోటీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాగైతే ఓటమి బాటను చూపిందో.. వీరు జగన్ సర్కార్ కూడా అదే బాట పట్టడానికి దోహదపడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఔను కోడికత్తి శీను జై భీమ్ పార్టీలో చేరి కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పోటీలో నిలవనున్నారు. వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖరారైంది. అలాగే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ సర్కార్ ను చెరిగి పారేస్తున్నారు. ఆమె కూడా ఎన్నికల బరిలో నిలుచుంటారు. చివరిగా దస్తగిరి కూడా జైభీమ్ పార్టీలో చేరి పులివెందుల బరిలో దిగేందుకు రెడీ అయిపోయారు. వీరు నలుగురూ గెలిచినా, ఓడినా వీరి పోటీ ప్రభావం మాత్రం రాష్ట్రం మొత్తం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టీకానికి వీరు నలుగురూ కూడా బాధితులే కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు.